PM Modi: బంగారం, పెట్రోల్‌, డీజిల్‌ వాడకంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Modi: సొంత వాహనాల కంటే వీలైనంత వరకు మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని సూచించారు. పర్యావరణ హితమైన, పొదుపైన ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మళ్లాలని కోరారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలన్నారు. ఆఫీసులకు వెళ్లడం తగ్గించి..

PM Modi: బంగారం, పెట్రోల్‌, డీజిల్‌ వాడకంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Pm Modi

Updated on: May 10, 2026 | 9:00 PM

PM Modi: హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగం, విదేశీ మారక ద్రవ్యం ఆదా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అంటూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజారవాణాపై మొగ్గు:

సొంత వాహనాల కంటే వీలైనంత వరకు మెట్రో రైళ్లు, బస్సులు వంటి ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించాలని సూచించారు. పర్యావరణ హితమైన, పొదుపైన ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మళ్లాలని కోరారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలన్నారు. ఆఫీసులకు వెళ్లడం తగ్గించి, వీలైనంత వరకు ‘వర్క్‌ఫ్రమ్ హోమ్‌’, ‘ఆన్‌లైన్ మీటింగ్‌లు’ నిర్వహించుకోవాలని సూచించారు. ఇది ఇంధన ఆదాకు ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

బంగారం, రాగి కొరతపై హెచ్చరిక:

దేశంలో విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగాయని, దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాది పాటు ప్రజలు బంగారం కొనడం ఆపివేయాలని కోరారు. గతంలో యుద్ధ సమయాల్లో దేశం కోసం ప్రజలు బంగారం దానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అలాగే దేశంలో రాగి (Copper) కొరత తీవ్రంగా ఉందని, వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు తమ ఖర్చులను నియంత్రించుకోవాలని ప్రధాని కోరారు. ఆడంబరాలు వద్దని, అనవసరమైన దుబారా ఖర్చులు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని సూచించారు.

విదేశీ ప్రయాణాలు:

విదేశీ ప్రయాణాలను ప్రస్తుతానికి మానుకోవడం ద్వారా దేశ సంపద బయటకు వెళ్లకుండా అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలుతో కూడిన సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆకాంక్షించారు.

దేశానికి ప్రధాని మోదీ 9 అప్పీల్స్‌

1 .పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వినియోగించండి

2. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి

3. మెట్రో తరహా ప్రజా రవాణా వాడండి-మోదీ

4. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి, ఆడంబరాలు వద్దు

5. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి-మోదీ

6. ఏడాదిపాటు బంగారం కొనకుండా శపథం చేయాలి

7. వంట నూనె వాడకం తగ్గించుకోవాలి-మోదీ

8. ఎరువులు, రసాయనాల వినియోగం సగానికిసగం తగ్గించండి

9.ఆన్‌లైన్‌ మీటింగ్‌లు, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us