రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతోంది. నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో కేరళలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఎండలతోపాటు.. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవగా.. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..
Andhra Pradesh and Telangana Weather Report

Updated on: May 29, 2026 | 7:15 AM

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ, ఏపీలో వాతావరణం చల్లబడుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు కూడా ఒకట్రెండు రోజుల్లో ఎంటర్‌ కానుండటంతో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం రాత్రి వాన కుమ్మేసింది. కొన్నిచోట్ల ఈదురుగాలు బీభత్సం, ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. జూన్‌ 3,4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్‌నకు చేరుకున్నాయని.. వచ్చే వారంలో మరింత విస్తరిస్తాయని తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 5-10 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో వచ్చే మూడురోజులు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని వివరించింది.

ఇదిలాఉంటే.. ద్రోణి ప్రభావంతో శుక్రవారం మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇవాళ.. 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఏఏ జిల్లాల్లో వానలు పడ్డాయంటే..

ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఎండ మిడిసిపడగా.. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో గుడివాడ అంధకారంగా మారింది.

విజయవాడ, మచిలీపట్నం, తిరువూరు, మైలవరం ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల బీభత్సంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ విరిగిపడ్డ చెట్లు, కరెంట్ స్తంభాలు.

తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజమండ్రిలో పలుచోట్ల ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. భారీ వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. రాజమండ్రి నగరమంతా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు అలజడి సృష్టించాయి. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం కూల్‌కూల్‌గా మారిపోయింది. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. హోర్డింగ్‌లు కొట్టుకుపోయాయి. ఈదురుగాలుల ప్రభావంతో అలర్ట్‌ అయిన అధికారులు ముందుగానే విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో పలుచోట్ల వర్షం పడింది. పాడేరులో వడగళ్లతో కూడిన భారీ వర్షం పడగా.. అరకులో భారీ వర్షం కురిసింది. చింతపల్లిలో తేలికపాటి వర్షం పడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. ఇల్లందు, కొత్తగూడెం మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి కొన్నిచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు రోడ్లపై పడిపోయాయి.

Follow Us