సోషల్ మీడియా రెండు వైపులా పదునుండే కత్తిలాంటిది. దీనితో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలూ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా దూరంగా ఉన్న వారితో సులభంగా కమ్యూనికేట్ అవ్వొచ్చు. అయితే సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయాలు కొన్ని సందర్భాల్లో అనర్థాలకు దారి తీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సోషల్ మీడియాతో జరిగే అనర్థాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరుకు చెందిన గోపీ అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది. అనంతరం ఆ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారింది.
తనకు ఉద్యోగం లేదని, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలని.. అప్పటికే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యువతిని అడిగాడు గోపీ. దీంతో ఆమె తాను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించింది. హైదరాబాద్‌కి రావడంతో ఇద్దరు తరచూ కలవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సదరు యువతి గోపీకి చాలా సార్లు నగదు సహాయం ఇచ్చింది. అయితే గత కొంత కాలంగా గోపీ మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
దీంతో ఈ విషయం గమనించిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ గోపీని దూరం పెట్టింది. తనను కలవకూడదని, మాట్లాడకూడదని కండిషన్ పెట్టింది. అయితే గోపీ మాత్రం తనతో ఎప్పటిలాగే మాట్లాడాలని, డబ్బులు ఇవ్వాలని, శారీరకంగా కలవాలని బెదిరించాడు. దీనికి ఆమె తిరస్కరించడంతో గతంలో ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్‌మేల్ చేయడం ప్రారంభించాడు. దీంతో సదరు యువతి శనివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోపీపై 354 (డి), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుని కోసం గాలిస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..