
హైదరాబాద్, జూన్ 8: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు మరో ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఓ యువ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతురాలు శివ దానపు దేవనందిని (25) స్వస్థలం కృష్ణా జిల్లా గణపవరం గ్రామం. 2022 నవంబర్ 8న పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలకు చెందిన తిరుమల రేవంత్ కుమార్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం దంపతులు హైదరాబాద్‌లోని నేరేడ్మెట్ పరిధిలో ఉన్న జేజే నగర్‌లోని SSB క్లాసిక్ అపార్ట్‌మెంట్లో గత మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో రేవంత్ కుమార్ పనిమీద బయటకు వెళ్లాడు. అనంతరం పలుమార్లు భార్యకు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో ఆందోళన చెందిన అతను ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని దేవనందిని వేలాడుతూ కనిపించింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలి మొబైల్ ఫోన్‌ను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో దేవనందిని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు, ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు నిరంతరం ఒత్తిడి, వేధింపులకు గురిచేసినట్లు గుర్తించారు. ఈ మానసిక ఒత్తిడిని భరించలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రి భీమవరపు వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లోన్ యాప్ నిర్వాహకుల పాత్ర, వేధింపుల స్వరూపంపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో అక్రమ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి, అనంతరం అధిక వడ్డీలు, బెదిరింపులు, వ్యక్తిగత వివరాల దుర్వినియోగం వంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహా వేధింపుల కారణంగా అనేక మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అక్రమ లోన్ యాప్‌ల వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను లేదా సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
నోట్: ఆత్మహత్య ఆలోచనలు, తీవ్ర మానసిక ఒత్తిడి ఎదురైతే వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం. అత్యవసర పరిస్థితిలో స్థానిక అత్యవసర సేవలు లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.