Laptops: కేవలం రూ.4 వేలకే ల్యాప్‌టాప్.. భారీగా ఎగబడ్డ జనం

Hyderabad: రూ.4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ హైదరాబాద్‌లో ఓ షాపు యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. దీంతో నగరం నలుమూలల నుంచి భారీగా జనం చేరుకుని షాపుపైకి ఎగబడ్డారు. కిలోమీటర్ల మేర షాపు ముందు క్యూ కట్టారు. దీంతో చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.

Laptops: కేవలం రూ.4 వేలకే ల్యాప్‌టాప్.. భారీగా ఎగబడ్డ జనం

Updated on: Dec 28, 2025 | 5:37 PM

ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు ల్యాప్‌టాప్ అనేది అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో అవసరాల కోసం చాలామంది పర్సనల్ ల్యాప్‌టాప్ వాడుతున్నారు. సాధారణంగా ఇది కొనుగోలు చేయాలంటే రూ.20 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక బ్రాండ్‌ను బట్టి ఎక్కువ ధర పడుతుంది. అంత ధర పెట్టి కొనుగోలు చేయలేని వారు సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ లేదా బయట షాపుల్లో యూజ్డ్ ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి తక్కువ ధరకే లభిస్తుండటంతో ఎక్కువమంది కొనుగోలు చేస్తూంటారు. కొత్తది కొనుగోలు చేయడానికి బడ్జెట్ సరిపోని వారు పాతది కొని ఉపయోగిస్తుంటారు.

రూ.4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ ఆఫర్

తక్కువ ధరకే ల్యాప్‌టాప్ ఆఫర్‌లో తీసుకొవచ్చంటూ సోషల్ మీడియా ద్వారా షాపుల యజమానులు కస్టమర్లను ఆకట్టుకుంటూ ఉంటారు. తక్కువకే వస్తుందని కొనుగోలు చేసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్లోని ఓ ఎలక్ట్రానిక్ షాపు యాజమాన్యం రూ.4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఇది తెలుసుకున్న చాలామంది ఆదివారం ఉదయం ఆ షాపు ముందు క్యూ కట్టారు. దీంతో రద్దీ ఎక్కువ కావడం, రోడ్డుపైకి వరకు కస్టమర్లు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. క్యూలైన్లో ఉన్న మహిళలు, వృద్దులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని షాపును మూసివేయించారు. అలాగే భద్రతా చర్యలు పాటించలేదంటూ హెచ్చరించారు.

ప్రచారం కోసం ఆఫర్లు

షాపుకు ప్రచారం కోసం యజమాని ఈ ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం తొలుత వచ్చిన 20 మందికి మాత్రమే ల్యాప్‌టాప్ ఇచ్చేలా ఆఫర్ పెట్టారు. కానీ జనం భారీగా రావడంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రోడ్లపైకి వరకు జనం క్యూ కట్టడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేయాల్సి వచ్చింది. ప్రచారం కోసం ఇలా జనాల ప్రాణాలతో చెలగాటం ఆదుకోవద్దంటూ షాపు యజమానులను పోలీసులు హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే రూ.4 వేలకు మంచి ల్యాప్‌టాప్‌లు అందించే అవకాశం ఉండదని, ప్రజలు సోషల్ మీడియలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని టెక్ నిపుణులు చెబుతున్నారు. పనికిరానివి, రీపేర్ చేసిన వాటిని కట్టబెట్టే అవకాశం ఉంటుందంటున్నారు. వీటి క్వాలిటీ, గ్యారంటీపై స్పష్టత ఉండదని, ఇలాంటివి కొనుగోలు చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.