ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రైల్వేస్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సుందరీకరణ పనులు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్లాట్‌ఫారం నెం.10 వద్ద ‘ఐ లవ్ సికింద్రాబాద్’ సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే రద్దీ స్లేషన్లలో సికింద్రాబాద్ స్టేషన్ ఒకటి. ఇక్కడ ప్రస్తుతం రోజు సగటున సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. జంటనగరాల్లో ప్రముఖ స్టేషన్ అయిన సికింద్రాబాద్‌కు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ వినూత్నంగా, ఆక్షణీయంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ సెల్ఫీ ఔత్సాహికులకు, పర్యాటకులకు, ప్రయాణికులకు అపారమైన వినోదాన్ని కలిగిస్తుంది. స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఐకానిక్ టైపోగ్రాఫికల్ స్కల్ప్చర్ రాత్రివేళల్లో ప్రకాశవంతమైన మెరుపులతో స్టేషన్ వైభవాన్ని మరింత పెంచుతుంది. ఆకర్షణీయంగా రూపొందించిన ఈ సెల్ఫీ పాయింట్ ప్రయాణికులలో సెల్ఫీ పట్ల ఆసక్తి కలిగిస్తుంది.
సెల్ఫీపై ఆసక్తిగల వారికి సుందరమైన వేదికగా నిలుస్తుంది. సృజనాత్మకమైన ఈ సెల్ఫీ పాయింట్ ఏర్పాటుకు చొరవ తీసుకొని కృషి చేసిన సికింద్రాబాద్ డివిజినల్ అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. కళాత్మకంగా రూపొందించిన ఈ సెల్ఫీ పాయింట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుతుందని అన్నారు. ప్రయాణికులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని అన్నారు.
హైదరాబాద్ వార్తల కోసం..