ఓ వీకెండ్ పార్టీ ఇప్పుడు పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయ్యింది.. హైదరాబాద్ శివారు జన్వాడలో జరిగిన రేవ్ పార్టీ జరగడం.. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది.. పార్టీలో పాల్గొన్న వాళ్లలో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది ఒకరే అయినా.. హైప్రొఫైల్ కేసు కావడంతో.. ఈ న్యూస్ బయటకు రావడం ఆలస్యం రాజకీయంగానూ విమర్శలు మొదలయ్యాయి.. శనివారం రాత్రి హైదరాబాద్ శివారు జన్వాడలో ఓ రేవ్ పార్టీ జరిగింది.. రాజ్ పాకాలకు చెందిన ఈ ఫామ్‌హౌస్‌లో పార్టీకి 35 మంది హాజరయ్యారు. ఈ పార్టీపై పోలీసులకు నిన్న రాత్రి ఫిర్యాదు అందడంతో.. నార్సింగి పోలీసులు, సైబరాబాద్ SOT బృందాలతోపాటు ఎక్సైజ్ పోలీసులు ఫామ్‌హౌస్‌కి వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడ హై ఫై పార్టీ జరుగుతున్నట్టు గుర్తించారు. పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టు చేస్తే.. విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యం, గేమింగ్ కాయిన్స్, క్యాసినో మెటీరియల్ గుర్తించారు.. రాజ్‌పాకాలపై NDPS, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రేవ్‌పార్టీ కేసులో A1-గా కార్తీక్.. A-2గా రాజ్ పాకాల పేర్లను చూపించారు.
హైదరాబాద్ శివారు జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీకి 35 మంది హాజరయ్యారు.. వీరిలో 14 మంది మహిళలు కూడా ఉన్నారు.. పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడంతో స్నిఫర్ డాగ్స్‌ను కూడా రంగంలోకి దించి పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు.. ఫామ్‌హౌస్‌లో 10 లీటర్ల అనుమతిలేని ఫారిన్ లిక్కర్ , 10 ఇండియన్ మేడ్ లిక్కర్ బాటిల్స్ సీజ్ చేశారు.. జన్వాడలో పార్టీకి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
పార్టీకి హాజరైన వారిలో ప్రముఖులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ రేవ్ పార్టీ కేసు సంచలనంగా మారింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.. బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీలా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సూటిగా ప్రశ్నలు సంధించారు.. అసలైన వ్యక్తిని తప్పించారని వార్తలొస్తున్నాయంటూ కూడా సెటైర్లు వేశారు.. కాంగ్రెస్, BRS కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గుచేటు అంటు ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్.. దర్యాప్తు పక్కాగా జరగాల్సిందేనన్నారు.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలంటూ బండిసంజయ్ సూచించారు.
ఓ కీలక నేత బావమరిది ఫామ్‌హౌజ్‌లో అసాంఘిక కార్యకలాపాలను చూస్తే.. తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అని ప్రభుత్వం అంటుంటే.. తన సొంత బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌పార్టీలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. సోదాలకంటే ముందే 20 మంది వెళ్లిపోయారని సమాచారముందని.. తెలంగాణ సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారంటూ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.