
హైదరాబాద్‌లో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి భయాలు వెంటాడుతున్నాయి. నీటిని పొదుపుగా వాడాలని, అనవసరంగా వృథా చేయొద్దని జలమండలి అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. బోర్లు వేయొద్దని, కార్లు, బైక్‌లు కడగడానికి తాగునీటిని వినియోగించొద్దని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు. ఓవైపు నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తుంటే.. మరోవైపు మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో మాత్రం ఇందుకు భిన్నమైన దృశ్యం కనిపించింది.
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే సిబ్బంది తమ వాహనాలను నీళ్లతో శుభ్రం చేస్తున్న వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని సామాన్యులు వాహనాలు కడిగినా చర్యలు తీసుకుంటున్న అధికారులు.. పోలీస్ స్టేషన్లోనే నీరు వృథా అవుతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నీటి పొదుపు విషయంలో ప్రజలకు ఒక రకమైన నిబంధనలు, ప్రభుత్వ విభాగాల్లో మాత్రం మరో రకమైన వ్యవహారం ఉంటుందా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు పొదుపు పాఠాలు చెబుతున్న వ్యవస్థలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అధికారుల తీరుపై చర్చకు దారితీసింది.
నీటి సంరక్షణ అనేది కేవలం ప్రజల బాధ్యత మాత్రమే కాదు.. ప్రభుత్వ శాఖలు, అధికారులు కూడా అదే బాధ్యతను పాటించాల్సి ఉంటుంది. మరి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ నీటి వృథాపై జలమండలి అధికారులు స్పందిస్తారా? నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారా? లేక పోలీస్ స్టేషన్ వ్యవహారం కావడంతో చూసీచూడనట్లు వదిలేస్తారా? అన్నది వేచి చూడాలి.