ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన వేడుకకు సర్వం సిద్ధమైంది. నవరాత్రులు మండపాల్లో ఘనమైన పూజలందుకొని గంగమ్మ ఒడిలోకి చేరేందుకు గణేషడికి సమయం ఆసన్నమైంది. ఈ మేరకు రేపు శోభాయాత్రకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటల తర్వాత శోభాయాత్ర ప్రారంభమవుతుంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహాగణపతి విగ్రహం ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటుంది. అనంతరం హుస్సేన్ సాగర్ కు చేరుకోనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే శోభాయాత్ర, నిమజ్జనం ఏర్పాట్లు సజావుగా జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం 40వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
ఈ అర్ధరాత్రి నుంచే ఖైరతాబాద్ మహాగణేషుడిని నిమజ్జనానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు రాత్రి 9 గంటలకు మండపం వద్దకు భారీ క్రేన్ అండ్ తస్కర్ రానున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరిపూజలు జరుగనున్నాయి. అనంతరం 1 తర్వాత ఉత్సవ కమిటీ గణేషుడిని మండపం నుండి కదిలిస్తారు. 2 గంటల నుండి తెల్లవారుఝామున 4 గంటల వరకు ఇతర విగ్రహాలను భారీ తస్కర్ పైకి ఎక్కించనున్నారు. 4 గంటల నుండి 7 గంటల వరకు మహాగణపతి విగ్రహాన్ని భారీ వాహనంపై ఎక్కించి వెల్డింగ్ వర్క్ చేయనున్నారు. అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 9.30 గంటలకు క్రేన్ నంబర్ 4 వద్దకు మహాగణపతి చేరుకోగానే అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనంతరం మధ్యాహ్నం 12 వరకు గణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.
గణేష్ నిమజ్జనాల కోసం భాగ్యనగరంలోని ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. నిమజ్జనాల కోసం జిహెచ్ఎంసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకించి హుస్సేన్ సాగర్ చుట్టూ 5 చోట్ల 36 భారీ క్రేన్లు ఏర్పాటు చేసింది. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసి వెంటనే వ్యర్థాలు తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నిమజ్జన పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అవసరమైన శానిటేషన్ కార్మికులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లను నియమించింది. నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. శోభాయాత్ర మార్గాల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంది. అదే విధంగా POP విగ్రహాల కోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి