CM K Chandrashekar rao at Somajiguda Yashoda Hospital : కోవిడ్ బారిన పడి మూడు రోజులుగా ఫాంహౌస్ లోనే ఉంటూ చికిత్స పొందుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి రాబోతున్నారు. ఛాతి సీటీ స్కానింగ్ కోసం ఆయన యశోదా ఆస్పత్రికి వస్తున్నారు. కరోనా బారిన పడిన సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆయనకు వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని యశోదా ఆస్పత్రి వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. కాగా, నిన్న రాష్ట్ర మంత్రి, ఆయన తనయుడు కేటీ రామారావు, కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లు కేసీఆర్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదిలావుంటే, ఈనెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి కరోనా సోకిందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు.