Chicken Rates: సామాన్యులకు చికెన్ షాక్.. అమాంతం పెరిగిన కోడి మాంసం ధరలు.. కేజీ ఎంత ఉందంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.370 వరకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.. కోళ్ల మరణాలు, సరఫరా తగ్గుదలతో మార్కెట్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Chicken Rates: సామాన్యులకు చికెన్ షాక్.. అమాంతం పెరిగిన కోడి మాంసం ధరలు.. కేజీ ఎంత ఉందంటే..
Chicken Rates

Edited By:

Updated on: May 12, 2026 | 7:20 PM

తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. సాధారణ ప్రజల ప్లేట్‌లో తప్పనిసరిగా ఉండే చికెన్ ఇప్పుడు జేబుకు భారంగా మారింది. గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్ర ఎండలు, వడగాల్పులు పౌల్ట్రీ రంగాన్ని కుదిపేయడంతో చికెన్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ ధర దాదాపు రూ.100 వరకు పెరగడం వినియోగదారులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు మార్కెట్లలో లైవ్ కోడి ధర కిలోకు రూ.190 నుంచి రూ.220 వరకు పలుకుతుండగా.. స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.350 నుంచి రూ.370 వరకు చేరింది. వారం రోజుల క్రితం రూ.240-250 మధ్య లభించిన చికెన్.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా రూ.100 వరకు పెరగడంతో చాలా కుటుంబాలు కొనుగోళ్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిలో కొనేవారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణం ఎండల తీవ్రతే అంటున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదవుతుండటంతో కోళ్లు తీవ్రమైన హీట్ స్ట్రెస్‌కు గురవుతున్నాయి. దీంతో అవి సరిగా ఆహారం తీసుకోకపోవడం, నీరసం చెందడం, పెద్ద సంఖ్యలో మరణించడం జరుగుతోందని ఫారమ్ యజమానులు చెబుతున్నారు. ఫలితంగా మార్కెట్‌కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

హైదరాబాద్‌లోని మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో సరఫరా తీవ్రంగా తగ్గిందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. డిమాండ్ సాధారణంగానే ఉన్నా.. సరఫరా తగ్గిపోవడంతో హోల్‌సేల్ స్థాయిలోనే ధరలు పెరిగాయని అంటున్నారు. దాంతో రిటైల్ మార్కెట్లో వినియోగదారులపై భారం మరింత పెరిగింది.

ఇక ఎండలతో పాటు కోళ్ల దాణా ధరలు పెరగడం, రవాణా ఖర్చులు అధికమవడం కూడా చికెన్ రేట్ల పెరుగుదలకు మరో కారణంగా మారాయి. వేసవిలో కోళ్లను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక కూలింగ్ ఏర్పాట్లు చేయాల్సి వస్తోందని, దీంతో ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు భారీగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

సాధారణంగా వేసవిలో మాంసాహార వినియోగం కొంత తగ్గుతుందని భావించినా.. ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో ధరలు నియంత్రణలోకి రావడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎండలు ఇదే స్థాయిలో కొనసాగితే చికెన్ ధర కిలో రూ.400 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కిలో చికెన్ రూ.360 నుంచి 370 వరకు విక్రయిస్తున్నారు.

ఫిష్.. మటన్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

చికెన్ ధరలు పెరగడంతో ఇప్పుడు చాలా మంది ప్రత్యామ్నాయంగా చేపలు, మటన్ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రాంతాలను బట్టి మటన్ ధర కిలోకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉంది. ఇక బొచ్చ, రవ్వ, బంగారు తీగ వంటి చేపలు రూ.220 వరకూ, కొర్రమేను వంటి చేపలు రూ.600కు పైగా అమ్ముడవుతున్నాయి. అయినప్పటికీ చికెన్‌తో పోలిస్తే ఇవే కొంతమందికి మెరుగైన ఎంపికగా మారుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us