తెలంగాణలో సరికొత్త రగడ రాజుకుంది… ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ భగ్గుమంటోంది. నిర్బంధ పాలన నుంచి విముక్తి వచ్చినట్టు ప్రసంగంలో పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు మాజీ మంత్రులు. ప్రభుత్వ పాలసీలపైనా, 6 గ్యారెంటీలపైనా స్పష్టత లేదన్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ మేనిఫోస్టో మాత్రమే గవర్నర్ చదివారన్నారు కడియం శ్రీహరి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై కీలక ప్రసంగం చేశారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందన్నారు గవర్నర్. పౌరహక్కులు, ప్రజాహక్కులకు నాంది పలికిందన్నారు కొత్త ప్రభుత్వం. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు చేస్తామన్నారు. పాలకులు ప్రజలకు సేవకులే తప్ప.. పెత్తందార్లు కాదన్న గవర్నర్.. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ ఆవిర్భవించదని గుర్తు చేశారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. అది గవర్నర్ ప్రసంగంలా లేదని కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లుగా ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి విస్మరించారన్నారు. పైగా ప్రభుత్వం పాలసీల గురించి ప్రసంగంలో లేదున్నారు మాజీ మంత్రులు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకుని తెలంగాణ ప్రజలు 2014 నుంచే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రివ్యూలు చేస్తూ గత ప్రభుత్వంపై మంత్రులు విమర్శలు చేస్తుంటే… అటు మీ ఆరు గ్యారెంటీల సంగతేంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. పథకాల వార్ నడుస్తుండగానే తాజాగా గవర్నర్ ప్రసంగం వేదికగా మరో యుద్ధానికి తెరలేచింది.