
హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ ఊహించినట్లుగానే మరోసారి రికార్డు ధర పలికింది. ఏకంగా 27 లక్షల రూపాయలకు తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్‌రెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ వినాయకుడి ధర రూ.24.60 లక్షలు పలికింది. గతంలో కన్నా…2 లక్షల 40 వేల రూపాయలు ఎక్కువ పలికింది. ఇక లడ్డూ దక్కించుకున్న దాసరి దయాందన్‌రెడ్డి…వెంటనే ఉత్సవ కమిటీకి నగదు చెల్లించారు.
బాలాపూర్ గణేశుడి లడ్డూను దక్కించుకునేందుకు దాదాపు 36 మంది పోటీ పడ్డారు. వారిలో 25 మంది భక్తులు ఎప్పటిలాగే వేలం పాడినా…ప్రధానంగా ఆరుగురి మధ్య వేలంపాట కొనసాగింది. చివరకు 27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గతంలోనూ దయాందన్‌రెడ్డి లడ్డూ వేలంలో పాల్గొన్న ఆయను దక్కలేదు. బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న దయానంద్‌రెడ్డిని ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
బాలాపూర్ లడ్డూకి ఎంతో చరిత్ర ఉంది. 1994లో రూ.450లతో మొదలయ్యింది లడ్డూ వేలం ధర 30 ఏళ్లుగా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ… కొన్నవారి కొంగు బంగారంగా నిలుస్తోంది. వాస్తవానికి 1994 నుంచి 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. కందాడ మాధవ రెడ్డి అనే వ్యక్తి పోటీపడి 2002లో లక్షా 5 వేల రూపాయలకు లడ్డూ సొంతం చేసుకున్నారు. 2003లో లక్షన్నరకు పైన పలికిల ధర ఆ తర్వాత సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తోంది. గత ఏడాది వేలంలో రూ. 24.60 లక్షలు పలికిన లడ్డూను బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ 27లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు దాసరి దయానంద్‌రెడ్డి. మరోవైపు టీవీ9తో మాట్లాడిన దాసరి దయానంద్‌రెడ్డి, బాలాపూర్ గణేశుడి మహా ప్రసాదం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.