
శుభకార్యానికి వచ్చి ఆనందంగా తిరుగు ప్రయాణం ప్రారంభించిన ఓ కుటుంబాన్ని క్షణాల్లో విషాదంలోకి నెట్టేసింది అపార్ట్‌మెంట్ లిఫ్ట్ నిర్లక్ష్యం. లిఫ్ట్ డోర్ ఓపెన్‌గా ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని అడుగు వేసిన 60 ఏళ్ల మహిళ కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.
ఈ హృదయవిదారక ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ సమీపంలోని మూన్ రాక్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. షామీర్‌పేట్‌కు చెందిన లక్ష్మమ్మ (60) తన కుమారుడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై, కార్యక్రమం ముగించుకుని భర్త లింగయ్యతో కలిసి ఇంటికి బయలుదేరింది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్ వద్దకు చేరుకున్న సమయంలో లిఫ్ట్ డోర్ ఓపెన్‌గా కనిపించడంతో లిఫ్ట్ వచ్చిందని భావించిన లక్ష్మమ్మ అడుగు ముందుకు వేసింది. అంతే… లిఫ్ట్ గుంతలోకి జారి పడిపోయి అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందింది. భార్య కళ్లముందే కుప్పకూలిపోవడంతో భర్త లింగయ్య బోరున విలపించాడు. అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే లక్ష్మమ్మను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శుభకార్యం జరిగిన కుటుంబం ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో లిఫ్ట్‌కు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, సెన్సార్ వ్యవస్థలు పనిచేయకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా తేలాయి. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్ నిర్వహణ సంఘం, లిఫ్ట్ మెయింటెనెన్స్ ఏజెన్సీల పాత్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. లోపభూయిష్టులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో అపార్ట్‌మెంట్‌లలో లిఫ్ట్ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. సరైన సర్వీస్‌లు లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఇందుకు కారణమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్ లిఫ్ట్ మెయింటెనెన్స్ తప్పనిసరి అని మరోసారి గుర్తు చేస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం.. ఒక కుటుంబానికి జీవితాంతం మిగిలే గాయం అయ్యింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.