
హైదరాబాద్: సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తామంటూ తెలంగాణ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను బెదిరించిన ముఠా గుట్టురట్టు అయ్యింది. ఎమ్మెల్సీ నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠాలోని ఆరుగురు నిందితులను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రాజకీయ, సామాజిక ప్రతిష్ఠకు భంగం కలిగించడంతో పాటు ప్రాణహాని చేస్తామని బెదిరించి తొలుత రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మొత్తం 14 మందికి పైగా కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌కి సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు, అభ్యంతరకరమైన డీప్‌ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.5 లక్షలు వసూలు చేయడంతో పాటు మరో రూ.5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు.
నవంబర్ 5వ తేదీన ఫాతిమా బేగం అలియాస్ రీమా మరో ఐదుగురితో కలిసి ఇబ్రహీంబాగ్‌లోని ఎమ్మెల్సీ కార్యాలయానికి వెళ్లి నగదు అందుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నగదు తీసుకుని వెళ్తున్న సమయంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో నిందితుడు మహ్మద్ మొహ్సిన్ ఖాన్‌ను కూడా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.4.70 లక్షల నగదు, రెండు ఆటోలు, ఆరు సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ-1తో పాటు ఏ-4 నుంచి ఏ-9, ఏ-14 వరకు మరికొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మార్ఫింగ్ ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలతో బెదిరింపులకు పాల్పడితే డబ్బులు చెల్లించకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఈ ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..