
తనను ఉద్యోగం నుంచి తీసేశారనే కోసంతో పాత కంపెనీ క్లైంట్స్ క్రెడిట్ కార్డులు వాడి ఓ ఉద్యోగి ఆ కంపెనీకి ఏకంగా రూ.1.64 కోట్ల నష్టానికి కలిగించిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసిన మాజీ ఉద్యోగి క్రెడిట్ కార్డుల వివరాలను దుర్వినియోగం చేస్తూ భారీ మోసానికి పాల్పడ్డాడు. కంపెనీ క్లయింట్లకు చెందిన క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 1.64 కోట్ల మేర నష్టం కలిగించిన ఘటనపై సంస్థ డైరెక్టర్ చెరుకు అనిరుధ్ రెడ్డి సైబర్ క్రైమ్ ,సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన రిషబ్ జగ్గీ 2025 జనవరిలో ఈ కంపెనీలో టికెటింగ్ ఏజెంట్‌గా ఉద్యోంగలో చేశారు. అయితే అతని పనితీరు సంతృప్తికరంగా లేకపోవడంతో గత మార్చి నెలలో యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో కొద్దిరోజులకే రిషబ్ సొంతంగా ఒక ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. ఈ క్రమంలో కంపెనీ భాగస్వామ్య సంస్థకు చెందిన వ్యక్తుల వద్ద ఉన్న 9 క్రెడిట్ కార్డుల వివరాలను రిషబ్ జగ్గీ అక్రమంగా చేజిక్కించుకున్నాడు.
ఆ క్రెడిట్ కార్డులను ఉపయోగించి మొత్తం 386 మోసపూరిత లావాదేవీలు జరిపాడు. అదే కార్డుల ద్వారా దాదాపు 70కి పైగా విమాన టికెట్లను బుక్ చేశాడు. దీని వల్ల మొత్తంగా రూ. 1.64 కోట్ల విలువైన లావాదేవీలు జరిపి కంపెనీకి, క్లయింట్లకు తీవ్ర నష్టం చేకూర్చాడు. అయితే బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో అప్రమత్తమైన కంపెనీ డైరెక్టర్ అనిరుధ్ రెడ్డి వెంటనే ఘటనపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.