
సహాధ్యాయి అని నమ్మి కారు ఎక్కిన ఒక బీటెక్ విద్యార్థినిపై సహ విద్యార్థి నమ్మకద్రోహానికి పాల్పడి, బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి ఒడిగట్టిన ఘోర ఉదంతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అత్యంత వేగంగా స్పందించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఏరియాలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బాధిత యువతి, ఉడతల ఉదయ్ అనే యువకుడు ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ఒకే క్లాస్ కావడంతో వీరిద్దరికీ గత కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే మే 14వ తేదీ రాత్రి సమయంలో నిందితుడు ఉదయ్, ‘టీ తాగి వద్దాం’ అని నమ్మించి బాధితురాలిని ఆమె ఉంటున్న రూం వద్ద నుండి తన కారులో ఎక్కించుకున్నాడు.
అక్కడి నుండి దిల్ సుఖ్ నగర్ ఏరియా అంతా కారులో తిప్పిన నిందితుడు, తిరిగి ఇబ్రహీంపట్నం వైపు వస్తూ మార్గమధ్యంలో మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం ఇబ్రహీంపట్నంలోని బీడీఎల్ (BDL) రోడ్డు వైపు కారును తీసుకెళ్లి, అక్కడ బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించాడు. తను కూడా మద్యం సేవించిన అనంతరం, మత్తులో స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న యువతిని ఇబ్రహీంపట్నంలోని ఒక రూమ్‌కు తీసుకెళ్లి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధితురాలు మరుసటి రోజు (మే 15న) ధైర్యంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణమే స్పందించారు. సిఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, ఘటన జరిగిన మూడు రోజుల్లోనే నిందితుడు ఉడతల ఉదయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.