50 కూడా కాదు.. 38 గజాలే! హైదరాబాద్‌లో కూలిన 7 అంతస్తుల భవన భాగోతం!

హైదరాబాద్‌ అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కేవలం 38 నుంచి 50 గజాల స్థలంలో నాలా ఆక్రమణతో భారీ భవనం నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతులు, నాణ్యత, అక్రమ కట్టడాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

50 కూడా కాదు.. 38 గజాలే! హైదరాబాద్‌లో కూలిన 7 అంతస్తుల భవన భాగోతం!
Hyderabad Anjaiah Nagar Building Collapse

Updated on: Aug 23, 2026 | 8:03 AM

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో టైల్స్‌ పనులు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు ఉమేశ్‌ కారే (34), మోపత్‌ (42) మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

38 గజాలే..

అంజయ్యనగర్‌లో ప్రైవేటు హాస్టళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో చిన్న స్థలాల్లోనూ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ప్రాంతంలో సయ్యద్‌ సాజిద్‌కు 38 గజాల స్థలం ఉంది. జయదర్శిని అపార్ట్‌మెంట్‌ ప్రహరీకి ఆనుకుని ఉన్న నాలాను ఆక్రమించి మొత్తం 48 గజాల విస్తీర్ణంలో ఏడంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించగా, అప్పటి నుంచే స్థానికులు జీహెచ్‌ఎంసీ, హైడ్రాకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.

ప్రమాణాలు గాలికి..

తక్కువ విస్తీర్ణంలో ఏడంతస్తుల నిర్మాణం చేపట్టడంతో పాటు పిల్లర్ల నిర్మాణంలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నాలా వైపు ఉన్న పిల్లర్లు కుంగిపోవడంతో భవనం ఆ వైపునకు వాలినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శనివారం మధ్యాహ్నం 1.06 గంటల సమయంలో ఒక్కసారిగా భవనం పక్కనే ఉన్న ఐదంతస్తుల జయదర్శిని అపార్ట్‌మెంట్‌పై కూలిపోయింది.

భవనం శిథిలాలు అపార్ట్‌మెంట్‌లోని సీ బ్లాక్‌ దక్షిణ వైపున ఉన్న ఐదు ఫ్లాట్లపై పడటంతో అవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాలుగో అంతస్తులో ఉన్న వృద్ధ దంపతులు గాయపడ్డారు. కుడివైపున 120 గజాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన మరో భవనం కూడా స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం సమయంలో భూకంపం వచ్చిందని భావించిన స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, హైడ్రా బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల నుంచి రెండు మృతదేహాలను వెలికితీశారు. మరికొందరు కింద చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో జాగిలాలు, విక్టిమ్‌ లైవ్‌ డిటెక్టర్‌ కెమెరాల సాయంతో గాలింపు చేపట్టారు.

ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు భవన యజమాని సాజిద్‌, కాంట్రాక్టర్‌ మోహినుద్దీన్‌పై కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు, కూలిన భవనాన్ని నాలుగు నెలల క్రితమే సీజ్‌ చేసినట్లు సీఎంసీ కమిషనర్‌ సృజన తెలిపారు. అయితే న్యాయపరమైన అనుమతులు లేకపోవడంతో దాన్ని కూల్చలేకపోయామని వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో జయదర్శిని అపార్ట్‌మెంట్‌ వాసులు ఫ్లాట్లు ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. దెబ్బతిన్న మరో భవనంలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. ఆ భవనాన్ని కూల్చాలా లేదా అనే అంశంపై నిపుణుల పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉండగా, అంజయ్యనగర్‌లో 50, 60 గజాల స్థలాల్లో భద్రతా నిబంధనలు పాటించకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. నాలాల పక్కన ఉన్న భవనాలను ఇంజినీర్లతో అధ్యయనం చేయించి ప్రమాదకరంగా ఉన్న వాటిని కూల్చివేస్తామని తెలిపారు. ఈ ఘటనతో నగరంలో చిన్న స్థలాల్లో భారీ నిర్మాణాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

పార్కులోనూ భవనం..

నేతలతో కలిసి కబ్జాలు, భవన నిర్మాణ పనులు ప్రారంభించిన సాజిద్‌కు.. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఇంటిని అమ్మినప్పుడు భారీగా ఆదాయం వచ్చింది. ఆ డబ్బుతో బిల్డర్‌ అయ్యాడు. ఇంజినీరింగ్‌ నైపుణ్యం ఏ మాత్రం లేకుండా,  ప్రణాళిక లేకుండా  కాంట్రాక్టు తీసుకోవడం, హాస్టళ్లను నిర్మించడం అతనికి అలవాటుగా మారింది. అధికారులకు లంచాలు ఇస్తుండటంతో.. సాజిద్‌ కట్టే భవనాలవైపు కన్నెత్తి చూడరు. కూలిన భవనంపై, అలాగే కాలనీ పార్కును ఆక్రమించి ప్రస్తుతం ఏడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us