AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడా..! ఊపిరికీ గ్యారెంటీ లేదా? హైదరాబాద్ మరో ఢిల్లీలా మారుతోందా..?

Hyderabad Pollution: వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీపావళి తర్వాత పొగమంచు, వాహనాల పొగ, నిర్మాణ పనుల నుంచి వెలువడే కాలుష్యం నగరవాసుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులకు స్వచ్ఛమైన గాలి అందని పరిస్థితి నెలకొంటోంది. అసలు హైదరాబాద్ గాలి నాణ్యత ఎలా ఉంది? నగరవాసుల ఊపిరికి పెను ముప్పు పొంచి ఉందా?

ఓరి దేవుడా..! ఊపిరికీ గ్యారెంటీ లేదా? హైదరాబాద్ మరో ఢిల్లీలా మారుతోందా..?
Hyderabad Pollution
Siva Nagaraju
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 6:20 PM

Share

ఒక్క నిమిషం ఊపిరి ఆపితేనే మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది రోజూ విషం కలిసిన గాలిని పీలుస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది. మన కళ్లకు కనిపించని కాలుష్యం.. నిశ్శబ్దంగా ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. దీపావళి పండుగ చేసుకున్న మరుసటి రోజే నగరాన్ని పొగ మేఘాలు కమ్మేస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవాళ్లకు స్వచ్ఛమైన గాలి కూడా సవాలుగా మారుతోంది. ఒకప్పుడు భాగ్యనగరంగా పేరొందిన హైదరాబాద్.. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్‌గా మారుతోంది. ఎత్తైన భవనాలు పెరుగుతున్నాయి. ఫ్లైఓవర్లు విస్తరిస్తున్నాయి. రోడ్లపై వాహనాలు పోటెత్తుతున్నాయి. కానీ మనిషి బతకడానికి అవసరమైన స్వచ్ఛమైన గాలి మాత్రం తగ్గిపోతోంది. అసలు హైదరాబాద్‌లో మనం పీల్చుకుంటున్న గాలి ఎంత సురక్షితం. మన ఊపిరికి భరోసా ఉందా?

దీపావళితో బయటపడిన విషగాలి

దీపావళి అంటే దీపాల వెలుగులు. టపాసుల సందడి. కానీ ఆ సందడి వెనుక ప్రమాదకరమైన కాలుష్యం దాగి ఉంది. బాణసంచా పేలుళ్లతో PM2.5, PM10 వంటి సూక్ష్మ ధూళి కణాలు గాలిలో పెరుగుతున్నాయి. ఇవి కంటికి కనిపించకపోయినా ఊపిరితిత్తుల్లోకి చేరతాయి. దగ్గు, గొంతు మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆస్తమా, అలర్జీలతో బాధపడేవారికి మరింత ప్రమాదం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

2026 దీపావళి రాత్రి హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు మానిటరింగ్ కేంద్రాల్లో AQI 500 దాటినట్లు నివేదికలు వచ్చాయి. బేగంపేటలోని ప్రకాశ్‌నగర్ ప్రాంతంలో ఒక పర్యవేక్షణ కేంద్రం దగ్గర 828 వరకు నమోదైంది. అయితే ఇవి ప్రైవేటు కేంద్రాల రీడింగ్స్. అధికారిక CPCB గణాంకాలతో వీటిని నేరుగా పోల్చకూడదు. అయినా కాలుష్యం తీవ్రతపై ఇవి హెచ్చరికలు చేస్తున్నాయి.

గతంతో పోలిస్తే ఎలా ఉంది

హైదరాబాద్‌లో దీపావళి సమయంలో కాలుష్య స్థాయులు గత కొన్నేళ్లుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 2020లో దీపావళి రోజు PM2.5 స్థాయి 64 మైక్రోగ్రాములుగా ఉండగా.. 2021లో 81కు, 2022లో 105కు, 2023లో 119కు చేరింది. 2024లో 84కు, 2025లో 69కు తగ్గింది. PM10 స్థాయి కూడా 2020లో 128 ఉండగా.. 2023లో 188కు చేరింది. 2025లో 153గా నమోదైంది. అంటే మధ్యలో కొంత తగ్గుదల కనిపించినా, కాలుష్య సమస్య మాత్రం పూర్తిగా తొలగిపోలేదు.

ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ ఎంత

కాలుష్యం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఢిల్లీ. చలికాలం వచ్చిందంటే అక్కడి ప్రజలు విషగాలితో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. నవంబర్ 9న ఉదయం ఢిల్లీలో AQI 370గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 400 దాటింది. హైదరాబాద్‌లో దీపావళి రాత్రి కొన్ని ప్రైవేటు మానిటర్లలో 500 దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇక విజయవాడలో దీపావళికి ముందు నవంబర్ 7న అధికారిక AQI 53గా నమోదైంది. అదే సమయంలో హైదరాబాద్‌లో 76గా ఉంది. గత ఏడాది దీపావళి సమయంలో హైదరాబాద్ AQI 116కు, విజయవాడ 98కు చేరింది.

టపాసుల అమ్మకాలు తగ్గాయా

కాలుష్యంపై ఆందోళన పెరుగుతున్నా దీపావళి టపాసుల వ్యాపారం మాత్రం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే బాణసంచా అమ్మకాలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఒక్కో కుటుంబం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేస్తే.. ఈసారి రూ.800 నుంచి రూ.వెయ్యికి పరిమితమయ్యాయి. ధరలు పెరగడం, ఆన్‌లైన్ విక్రయాలు, కొనుగోళ్లపై ఆసక్తి తగ్గడం కారణాలుగా చెబుతున్నారు.

టపాసులే కాదు.. రోజూ విషం పీలుస్తున్నామా

హైదరాబాద్ కాలుష్యానికి దీపావళి ఒక్కటే కారణం కాదు. ప్రతిరోజూ రోడ్లపైకి వస్తున్న లక్షలాది వాహనాలు గాలిలోకి పొగను వదులుతున్నాయి. డీజిల్ వాహనాల ఉద్గారాలు, ట్రాఫిక్ జామ్‌లు కాలుష్యాన్ని పెంచుతున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనాలు కూల్చడం, రోడ్లు తవ్వడం, నిర్మాణ ప్రాంతాల్లో ధూళిని నియంత్రించకపోవడం వల్ల సూక్ష్మ కణాలు గాలిలో కలుస్తున్నాయి. పటాన్‌చెరు, జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల ఉద్గారాలపై కూడా నిఘా అవసరం. టపాసుల పొగ కొన్ని గంటల సమస్య అయితే.. వాహనాలు, నిర్మాణాలు, పరిశ్రమల కాలుష్యం ఏడాది పొడవునా ఉండే సమస్య.

రాత్రిపూట మరింత ప్రమాదమా

పగటిపూట గాలిలో కలిసిన కాలుష్య కణాలు రాత్రిపూట కూడా వాతావరణంలోనే ఉండిపోవచ్చు. గాలి వేగం తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కాలుష్యం ఒకేచోట పేరుకుపోతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో రాత్రిపూట AQI ఎక్కువగా నమోదవుతుంది. అయితే ప్రతి రోజూ రాత్రే కాలుష్యం ఎక్కువగా ఉంటుందని చెప్పలేం. గాలి వేగం, ఉష్ణోగ్రత, వర్షం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

బయట కాలుష్యం ఉంటే ఇంట్లో సురక్షితంగా ఉంటామనుకోవడం కూడా పూర్తిగా సరైనది కాదు. కిటికీలు, తలుపుల ద్వారా బయట గాలి లోపలికి వస్తుంది. ఇంట్లో వంట పొగ, దుమ్ము, ధూళి కూడా గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు మూసి ఉంచడం, అవసరమైతే సరైన HEPA ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే N95 మాస్క్ ఉపయోగించడం ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల ఊపిరితిత్తులకు ముప్పు

పిల్లలు రోజూ పాఠశాలలకు వెళ్తున్నారు. రోడ్ల పక్కనే ఉన్న స్కూళ్లలో చదువుతున్నారు. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ పొగ మధ్య ప్రయాణిస్తున్నారు. వారి ఊపిరితిత్తులు ఇంకా ఎదుగుతున్న దశలో ఉంటాయి. అందుకే కాలుష్య ప్రభావం వారిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆస్తమా, దగ్గు, అలర్జీలు వంటి సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. వృద్ధులు, గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్నవారూ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కాలుష్యం వల్ల ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందా అనే అంశంపై వైద్య శాఖ ప్రత్యేకంగా గణాంకాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

చెట్లు తగ్గాయి.. కాంక్రీట్ పెరిగింది

ఒకప్పుడు హైదరాబాద్‌లో చెరువులు, చెట్లు, ఖాళీ స్థలాలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో ఎత్తైన భవనాలు, కాంక్రీట్ రోడ్లు, నిర్మాణాలు పెరుగుతున్నాయి. పచ్చదనం తగ్గడం, చెరువుల చుట్టూ నిర్మాణాలు పెరగడం నగర పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి. చెట్లు కాలుష్యాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా ధూళిని కొంతవరకు అడ్డుకోవడంలో, స్థానిక వాతావరణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చెట్లను నరికేసి భవనాలు కడితే చివరికి మనిషికి నీడతో పాటు స్వచ్ఛమైన గాలి కూడా కరువవుతుంది. చెట్టు లేని ఊరు, నీడ లేని బతుకు అన్న తీరులో పరిస్థితి మారుతోంది.

నియంత్రణ సంస్థలు ఏం చేస్తున్నాయి

కాలుష్యాన్ని కొలవడానికి కేంద్రాలు ఏర్పాటు చేయడం ఒక్కటే సరిపోదు. కాలుష్యాన్ని తగ్గించడానికి కఠినమైన చర్యలు కూడా ఉండాలి. నిర్మాణ ప్రాంతాలను కప్పి ఉంచడం, నీటిని చల్లి ధూళి ఎగరకుండా చూడడం తప్పనిసరి చేయాలి. రోడ్లపై పేరుకుపోయిన దుమ్మును శాస్త్రీయంగా తొలగించాలి. వాహనాల కాలుష్య పరీక్షలను కఠినంగా అమలు చేయాలి. పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలను నిరంతరం పరిశీలించాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలు విధించాలి. హైదరాబాద్‌లో ఎన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యతను కొలుస్తున్నారు. ఎక్కడ పర్యవేక్షణ కేంద్రాలు లేవు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ని చర్యలు తీసుకున్నారు అనే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

కాలుష్యాన్ని ఎలా అరికట్టాలి

ప్రభుత్వం, అధికారులు మాత్రమే కాదు, ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. అవసరం లేని ప్రయాణాలకు వ్యక్తిగత వాహనాలను ఉపయోగించకుండా మెట్రో, బస్సులను ప్రోత్సహించాలి. చెత్తను కాల్చడం ఆపాలి. టపాసుల వినియోగాన్ని తగ్గించాలి. ప్రతి కాలనీలో చెట్లు పెంచాలి. చెరువులు, పార్కులు, ఖాళీ స్థలాలను కాపాడాలి. నిర్మాణ పనుల్లో ధూళి నియంత్రణ తప్పనిసరి చేయాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలి. ఆసుపత్రులు, పాఠశాలల దగ్గర గాలి నాణ్యతపై ప్రత్యేక నిఘా పెట్టాలి.

అభివృద్ధి కావాలి

హైదరాబాద్ అభివృద్ధి చెందాలి. కొత్త రోడ్లు రావాలి. మెట్రో విస్తరించాలి. పరిశ్రమలు, ఐటీ సంస్థలు పెరగాలి. కానీ ఈ అభివృద్ధి మధ్య మనిషి ఆరోగ్యం బలికాకూడదు. ఫ్లైఓవర్లు, ఎత్తైన భవనాలు నగరానికి గుర్తింపు కావచ్చు. కానీ స్వచ్ఛమైన గాలి మాత్రమే ప్రజల జీవితాలకు భరోసా ఇస్తుంది. కాలుష్యం పెరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే. ముందుగానే మేల్కొనాలి. లేదంటే పండుగ రోజుల్లోనే కాదు. సాధారణ రోజుల్లోనూ ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.

ఒకప్పుడు భాగ్యనగరంగా వెలిగిన హైదరాబాద్. రేపు విషగాలి నగరంగా మారకూడదు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని కోల్పోతే చివరికి మనిషి జీవించే హక్కునే ప్రమాదంలో పడేసినట్లవుతుంది. నగరానికి కాంక్రీట్ భవనాలు ఎన్ని వచ్చినా చెట్లు, చెరువులు, స్వచ్ఛమైన గాలి లేకపోతే ఆ అభివృద్ధికి అర్థం ఏముంటుంది. హైదరాబాద్‌కు ఇప్పుడు కావాల్సింది మరో ఫ్లైఓవర్ మాత్రమే కాదు. ప్రతి ఒక్కరూ హాయిగా ఊపిరి పీల్చుకునే స్వచ్ఛమైన గాలి.

-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్ పుట్ ఎడిటర్, టీవీ9

Follow Us