కొందరు మత్స్యకారులు జలాశయంలో చేపల వేటకు వెళ్లారు. నీటిలోకి వలను వేసి.. కాసేపటి తర్వాత దాన్ని పైకి లాగగా.. అది బరువెక్కడంతో తెగ సంబరపడిపోయారు. పెద్ద చేప వలకు చిక్కిందని అనుకున్నారు.. తీరా పైకి లాగిన తర్వాత చిక్కింది చూసి దెబ్బకు స్టన్ అయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా..
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని ఉన్న సరళసాగర్ జలాశయంలో స్థానిక మత్స్యకారులు రోజులానే చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులు చేపల కోసం వలను నీటిలోకి విసరగా.. అది కాసేపటికి బరువెక్కింది. తీరా దాన్ని పైకి లాగి చూడగా.. అందులో వంద కిలోల బరువు ఏడు అడుగుల పొడవు ఉన్న మొసలి చిక్కింది. దీంతో ఒక్కసారిగా మత్స్యకారులు కంగుతిన్నారు. వలతో సహా ఆ మొసలిని బయటకు తీసిన మత్స్యకారులు.. చాకచక్యంగా దాన్ని పట్టుకుని బంధించగలిగారు. ఆ తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి.. జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అక్కడి చేరుకుని మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జూరాల జలాశయానికి తీసుకెళ్లి విడిచిపెట్టేశారు. జలాశయాలు, కాలువలు, నీటి కుంటలు ఉన్నప్పుడు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇలా మొసలి కనిపించే సంఘటనలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చూస్తున్నాం. ముఖ్యంగా గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.