Hyderabad: హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. ఇప్పుడు కడితే 90శాతం డిస్కౌంట్..

భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్. మీ ఇంటి పన్ను బకాయిలు ఉన్నాయా? వడ్డీ భారంతో ఆందోళన చెందుతున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్ నగర ప్రజల కోసం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆస్తి పన్ను బకాయిలపై ఏకంగా 90 శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.

Hyderabad: హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. ఇప్పుడు కడితే 90శాతం డిస్కౌంట్..
Ghmc Property Tax Interest Waiver

Updated on: Mar 12, 2026 | 7:40 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్‌ఎంసీ గుడ్ న్యూస్ తెలిపింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిల నుంచి విముక్తి పొందేందుకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ పథకం కింద బకాయి ఉన్న వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఏమిటీ ఓటీఎస్ పథకం?

చాలా కాలంగా ఆస్తి పన్ను చెల్లించని ఇంటి యజమానులపై అసలు పన్నుతో పాటు భారీగా వడ్డీ భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని ప్రకారం మీరు చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 90శాతం మాఫీ అవుతుంది. కేవలం 10శాతం వడ్డీని అసలు పన్నుతో కలిపి చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాత బకాయిలన్నింటికీ వర్తిస్తుంది.

గడువు ఎప్పటి వరకు?

ఈ రాయితీ ప్రయోజనం పొందాలనుకునే వారు మార్చి 31 లోపు తమ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుండి మళ్లీ పాత వడ్డీ నిబంధనలే వర్తిస్తాయని.. కాబట్టి ఈ 20 రోజుల సమయాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పారదర్శకతను పెంచేందుకు, అవినీతికి తావులేకుండా ఉండేందుకు ఆస్తి పన్ను బకాయిలను కేవలం ఆన్‌లైన్ వేదికల ద్వారానే స్వీకరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.

పౌరులు ఈ మార్గాల్లో సులభంగా పన్ను చెల్లించవచ్చు

అధికారిక వెబ్‌సైట్: www.ghmc.gov.in పోర్టల్‌లోకి వెళ్లి మీ PTIN నంబర్ ఎంటర్ చేసి చెల్లించవచ్చు.

మొబైల్ యాప్: MyGHMC యాప్ ద్వారా నేరుగా మీ ఫోన్ నుండే పేమెంట్ చేయవచ్చు.

సేవా కేంద్రాలు: మీ-సేవా (Me-Seva) కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లు లేదా ఈ-సేవా కేంద్రాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది.

నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

నగరంలో రోడ్ల నిర్మాణం, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి మౌలిక సదుపాయాల కల్పన మనం చెల్లించే పన్నుల పైనే ఆధారపడి ఉంటుంది. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలి” అని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కోరారు. ముఖ్యంగా బకాయిలు ఉన్న వారు ఈ 90శాతం వడ్డీ రాయితీని వదులుకోవద్దని ఆయన సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us