
మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన హన్మంతు అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం కవిత అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు సంతానం. హన్మంతు దంపతులు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే ఆదివారం సాయంత్రం హన్మంతు తన ఫోన్‌కు ఛార్జింగ్‌కు పెడదామని ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లాడు. ఛార్జర్ పెట్టి స్విచ్ వేయగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు హన్మంతు. గమనించిన భార్య కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు విద్యుత్ సరఫరాను ఆపేశారు. ఇక సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే స్విచ్ బోర్డు ప్రమాదకరంగా ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమింకగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త మరణించడంతో అతని భార్య కవిత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన చింతలకుంట గ్రామాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఫోన్ ఛార్జింగ్ పెట్టేప్పుడు ఇవి తెలుసుకోండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.