Hyderabad-Vijayawada: హైవేపై అచ్చం పోలీసుల్లానే మేనేజ్ చేశారు.. చివరకు అదిరిపోయే ట్విస్ట్..

సూర్యాపేట జిల్లాలో నకిలీ ఆర్టీవో అధికారుల ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను అడ్డుకుని తనిఖీల పేరుతో డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ డీసీఎం డ్రైవర్ నుంచి ఫోన్‌పే ద్వారా రూ.1,500 వసూలు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి బైక్, సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad-Vijayawada: హైవేపై అచ్చం పోలీసుల్లానే మేనేజ్ చేశారు.. చివరకు అదిరిపోయే ట్విస్ట్..
Hyderabad Vijayawada Highway

Edited By:

Updated on: Nov 22, 2026 | 10:04 AM

కష్టపడకుండా కాసులు సంపాదించాలనుకున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. యూనిఫాం లేకపోయినా ఆర్టీవో అధికారులమంటూ వాహనదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని హైవేలపై చెకింగ్‌ల పేరిట దందా మొదలు పెట్టారు. అమాయక వాహన దారులను బెదిరిస్తూ అందినకాడికి దోచుకున్నారు. చివరకు పోలీసుల నెట్‌వర్క్‌కు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. అడ్డంగా బుక్కైన ఈ నకిలీ అధికారుల ముఠా గుట్టు ఎలా రట్టయిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు గ్రామానికి చెందిన దారోజు రాజేంద్రచారి అలియాస్ రాజు, సుంకరి శ్రీనివాస్, పరాల ముత్తయ్యలు లగ్జరీ లైఫ్.. జల్సాలు.. జులాయి తిరుగుళ్లకు అలవాటు పడ్డారు. కష్టపడి పని చేయడం చేతకాక, జల్సాలకు డబ్బులు సరిపోక ముఠాగా ఏర్పడ్డారు. ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో రూట్ మార్చారు. అధికారుల అవతారమెత్తి దోపిడీకి ప్లాన్ వేశారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వల్లభాపురం సమీపంలో ఉన్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని తమ అడ్డాగా మార్చుకున్నారు.

సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి రమేష్ అనే డ్రైవర్.. నవంబర్ 13న తన డీసీఎం వాహనంలో ధాన్యం లోడింగ్ కోసం మహబూబాబాద్ జిల్లా గూడూరుకు వెళ్లాడు. అక్కడ ధాన్యం లోడ్ చేసుకుని కోదాడలోని రైస్ మిల్లుకు బయలు దేరాడు. రాత్రి చివ్వెంల మండలం వల్లభాపురం సమీపంలోకి రాగానే, పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు డీసీఎంను అడ్డగించారు. తాము ఆర్టీవో సిబ్బందిమంటూ బిల్డప్ ఇచ్చారు. వెహికల్ డాక్యుమెంట్లు తనిఖీ చేయాలంటూ డ్రైవర్‌ను బెదిరించి ఐదు వేల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదనడంతో చివరకు ఫోన్‌పే ద్వారా రూ.1,500 వసూలు చేశారు. అంతేకాకుండా డీసీఎంలో ఉన్న మరికొంత నగదును కూడా గుంజుకుని అక్కడి నుంచి పారిపోయారు.

బాధిత డ్రైవర్ ఈ విషయాన్ని వాహన యజమానికి తెలపడంతో, ఆయన వెంటనే చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌పే నంబర్, నిందితులు ఉపయోగించిన పల్సర్ బైక్ నంబర్ ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేలోని దురాజ్‌పల్లి ఎక్స్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో ఈ ముఠా తాము చేసిన ఘోరాలన్నింటినీ ఒప్పుకున్నారు. ఈ ముఠా హైవేపై వెళ్లే అమాయక డ్రైవర్లను టార్గెట్ చేసుకుని ఆర్టీవో అధికారులమని బెదిరింపులకు పాల్పడుతోందనీ సూర్యాపేట డిఎస్పి ప్రసన్న కుమార్ చెబుతున్నారు. నిందితుల నుంచి పల్సర్ బైక్, రెండు సెల్‌ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నామని,నిందితుల్లో ఒకరైన దారోజు రాజేంద్రచారిపై గతంలోనూ గంజాయి, చీటింగ్ కేసులు ఉన్నాయనీ పోలీసులు తెలిపారు.

జల్సాల కోసం అడ్డదారులు తొక్కిన ఈ నకిలీ ముఠా కథ చివరకు కటకటాల వెనుక ముగిసింది. హైవేలపై ఇలాంటి నకిలీ ముఠాల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Fake Rto Gang Arrested In Suryapet

Loading...
Unable to load recommendations.
Follow Us