Telangana RTC: దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం!

Telangana RTC: ఈ దసరా పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి..

Telangana RTC: దసరా పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులు.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం!
Tg Rtc

Edited By:

Updated on: Oct 07, 2026 | 6:58 PM

Telangana RTC: దసరా పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 7 వేల ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది.

ఇందులో భాగంగా కరీంనగర్ జోన్ నుంచి మొత్తం 3533 బస్సులు నడుపుతోంది. రీజియన్ల వారిగా ఆదిలాబాద్ 431, నిజామాబాద్ 719, కరీంనగర్ 1175, వరంగల్ 530, ఖమ్మం 678, హైదరాబాద్ జోన్ నుంచి 2155 బస్సులు నడుపుతుండగా రీజియన్ల వారిగా మహబూబ్ నగర్ 645, మెదక్ 255 , నల్గొండ 815, రంగారెడ్డి 440. అలాగే గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి 1312 దసరా పండగ కు ప్రత్యేక సర్వీసు లను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9,10,16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్లాన్ చేసింది. అలాగే, ఈ నెల 25, 26 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ (నల్ల చెరువు) , ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది.

స్పెషల్ సర్వీసులు:

ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ప్రధాన పండుగకు 1.5 వరకు టికెట్ ధరలను ఉమ్మడి కార్పొరేషన్గా ఉన్నప్పటి నుండి అమలు చేస్తుంది. టీజిఎస్ఆర్టీసీ ఏర్పడిన నాటి నుండి ప్రతి ప్రధాన పండుగకు దీన్ని అమలు చేస్తుంది.

ప్రత్యేక బస్సులను ఛార్జీలలో మార్పు:

ఈ దసరా పండుగకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 9, 10,16,17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 25,26 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి.

రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా దసరా కు నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ రెగ్యులర్ , స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి స్పష్టం చేశారు.

టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. దసరా కు స్వంత ఊర్లకు వెళ్లే ప్రయాణీకులు ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని యాజమాన్యం సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us