సిగపట్లు పట్టిన సవతులు.. కట్‌చేస్తే ఒకే రోజు రెండు దారుణాలు..! ఏం జరిగిందంటే..

కుటుంబ కలహాలు ఇద్దరు మహిళల ప్రాణాలను బలితీసుకున్నాయి. సవతుల మధ్య జరిగిన గొడవలో మొదటి భార్య దాడి చేయడంతో రెండో భార్య మృతి చెందింది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన మొదటి భార్య అనంతరం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది..

సిగపట్లు పట్టిన సవతులు.. కట్‌చేస్తే ఒకే రోజు రెండు దారుణాలు..! ఏం జరిగిందంటే..
Dispute Between Co Wives

Updated on: Aug 09, 2026 | 7:18 AM

ఆదిలాబాద్‌, ఆగస్ట్ 9: కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. సవతుల మధ్య జరిగిన గొడవలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆ ఘటనతో భయాందోళనకు గురైన మరో మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

సోనాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం కన్నుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య రాంబాయి కాగా, రెండో భార్య సాకృబాయి. ఈ నెల 5న ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రాంబాయి.. సాకృబాయిపై కర్రతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో సాకృబాయికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాకృబాయి మృతి చెందింది. సాకృబాయి మృతి చెందడంతో రాంబాయి తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఆమె.. గ్రామానికి దూరంగా ఉన్న ఓ పొలంలో తలదాచుకుంది. తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న రాంబాయి మరింత భయానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

ఆసుపత్రికి తరలించేలోపే మృతి

రాంబాయి పురుగు మందు తాగిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గంలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సాకృబాయి మృతదేహం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరకముందే రాంబాయి ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడంతో సోనాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఘర్షణకు దారితీసిన పరిస్థితులు, అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us