
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తదుపరి రాజకీయ వ్యూహాలపై ముఖ్యమంత్రి మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రేవంత్.. హంగ్ వచ్చిన స్థానాలపై ఫోకస్ పెట్టాలని మంత్రులకు సూచించారు. మేయర్, ఛైర్మన్ ఎన్నికల నాటికి ఎక్స్ అఫిషియో ఓట్ల వినియోగం ద్వారా అన్ని మున్సిపాలిటీలపై హస్తం జెండా ఎగురవేయాలని మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కొన్ని చోట్ల ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. అంతేకాకుండా ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రైతులకు ఇచ్చే ఆర్థిక సాయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో అదే ఊపును కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తక్షణమే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై మంత్రుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చే దిశగా అడుగులు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో రైతు భరోసాపై మంత్రులతో రేవంత్ చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులను ఈనెల 17న విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన నిధుల సర్దుబాటు, లబ్ధిదారుల ఎంపికపై సీఎం అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల విజయం తర్వాత రైతులకు ఈ ఆర్థిక సాయం అందించడం ద్వారా గ్రామీణ ఓటర్లలో మరింత విశ్వాసం నింపవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది.