Mahbub Nagar: అత్తాకోడళ్ళ మధ్య జరిగిన గొడవ ఓ చిన్నారి ప్రాణం తీసింది. తల్లి క్షణికావేశానికి ముక్కుపచ్చలారని పాప బలైంది. మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గండీడ్ మండలం జక్లపల్లి గ్రామానికి చెందిన అంజిలయ్య, సంతోషి దంపతులకు తొమ్మిది నెలల కుమార్తె ఉంది. అంజిలయ్య గొర్రెల కాపరి. శుక్రవారం రాత్రి వంట చేసే సమయంలో సంతోషికి, ఆమె అత్తకు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో చిన్నారి వాళ్ళ నాన్నమ్మ ఒడిలో ఉంది. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆవేశానికి గురైన సంతోషి.. చిన్నారిని లాక్కొని నేలకేసి విసిరింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అప్పటికే ఇంటికి వచ్చిన తండ్రి ఇరుగుపొరుగు సాయంతో పాపను కోస్గిలోని ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్ళాడు. అప్పటికే పాప మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు.