తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా ప్రియారిటి ఇవ్వని బీఆర్‌ఎస్ ఇప్పుడు పార్టీలో సమూల మార్పుల దిశగా అడుగులేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే పార్టీని ప్రభుత్వం అంటూ.. అడపాదడపా మినహా పెద్దగా తెలంగాణ భవన్‌లో హడావుడి ఉండేది కాదు. ఇప్పుడు ఒక పూర్తి ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నిర్మాణం, కార్యాలయ కార్యకలాపాల విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. అధికారంలో ఉన్న లేకపోయినా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ విధానం గురించి అన్ని పార్టీల నేతలు మాట్లాడుకుంటారు.
ఇప్పుడు కేసీఆర్ కూడా గతంలో రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా, ఎన్టీఆర్ ట్రస్ట్ మెంబర్‌గా, తెలుగుదేశం పార్టీ కార్యాలయ బాధ్యులుగా పని చేసిన రావుల చంద్రశేఖర్‌ని ప్రస్తుతం తెలంగాణ భవన్ ఇన్చార్జిగా నియమించారు. తెలుగుదేశం పార్టీలో నేతల ప్రెస్ మీట్లకు ముందు ఎలాగైతే పార్టీ నుంచి కొంత సమాచారం అందిస్తారు. ఇప్పుడు అలాంటి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. నిత్యం ఎవరో ఒక నేత తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై రోజు కనీసం రెండు మూడు ప్రెస్ మీట్ అయినా ఉంటున్నాయి.
వచ్చిపోయే కార్యకర్తలకు, మీడియా సిబ్బందికి ప్రత్యేకంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయించారు. పార్టీ కార్యకర్తల మెంబర్‌షిప్‌తో పాటు వచ్చే ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక విభాగం, పబ్లిక్ రిలేషన్స్- సోషల్ మీడియా కోసం మరొక వింగ్, రోజువారి కార్యకలాపాల కోసం మరికొంతమందిని ప్రత్యేకంగా నియమించారు. వీటితోపాటు త్వరలోనే కార్యకర్తలకు శిక్షణ తరగతులు కూడా ప్రారంభిస్తున్నట్లుగా సమాచారం.
వీలైనన్ని సార్లు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ తెలంగాణ భవన్‌లోనే అందుబాటులో ఉంటున్నారు. మాజీ మంత్రులు కూడా తమ జిల్లాలకు నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో తెలంగాణ భవన్‌లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక వీటితోపాటు రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరించడానికి మరో స్పెషల్ సెల్, హైడ్రా బాధితుల కోసం ప్రత్యేక లీగల్‌సేల్, సోషల్ మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తే వారికి వెంటనే న్యాయ సాయం అందించడానికి మరి కొంతమంది ఇలా తెలంగాణ భవన్ ను ఫుల్ బిజీ చేశారు కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి