Central Food and Public Distribution Department: కేంద్రం(Union Government)తో వరి కొనుగోలుపై తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పోరు సిద్ధమైన తరుణంలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పందించింది. 2021-22 రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ(Paddy Procurement) ప్రతిపాదనలు ఇంతవరకు తెలంగాణ పంపలేదని స్పష్టం చేసింది. ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అనేకసార్లు తెలంగాణను కోరిందని.. పలుమార్లు గుర్తుచేస్తూ రిమైండర్లు కూడా పంపించామని తెలిపింది. రబీ నుంచి ముడి బియ్యం సేకరణపై ప్రతిపాదనల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నామని కేంద్ర ప్రజా పంపిణీ శాఖ పేర్కొంది.
గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ గణనీయంగా పెంచామన్నారు. ముఖ్యంగా పారాబాయిల్డ్ రైస్ వినియోగించే రాష్ట్రాల్లో కేంద్రం పూల్ నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే అవసరం ఉంది. ఆయా రాష్ట్రాలు సొంతంగా ఉప్పుడు బియ్యం సేకరించుకుంటున్నందున కేంద్రం సేకరించాల్సిన మొత్తం తగ్గుతూ వచ్చిందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంతో చేసుకున్న ఎంవోయూ ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను మిగిలిన బియ్యాన్నిFCIకి అందించాల్సి ఉంటుంది. అయితే, అది ముడి బియ్యం రూపంలోనా, లేక పారాబాయిల్డ్ రూపంలోనా అన్నది నిర్ణయించే అధికారం దేశావసరాలను దృష్టిలో పెట్టుకుని ఎఫ్‌సీఐకే నిర్ణయాధికారం ఉంటుంది కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది.
ఎఫ్‌సీఐ వద్ద ఉన్న నిల్వల ప్రకారం 2020-21లోనే పారాబాయిల్డ్ రైస్ తీసుకోవడం సాధ్యపడదని తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు కేంద్రం ఇది వరకే తేల్చి చెప్పింది. అయినప్పటికే తెలంగాణ రాష్ట్రం వద్ద మిగిలిన 20 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైస్ తీసుకోమని కోరగా, అందుకు అంగీకరించిన కేంద్రం, తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం FCIకి పారాబాయిల్డ్ రైస్ ఇవ్వరాదని చెప్పామన్నారు. రాష్ట్రంలో రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమలను ప్రోత్సహించేలా ప్రోత్సాహకాలు అందించాలి. అంతేకాదు, ఫోర్టిఫైడ్ రైస్ తయారీకి అవసరమైన బ్లెండింగ్ సదుపాయాలను తెలంగాణ రాష్ట్రం పెంపొందించాల్సి ఉంటుందని పేర్కొంది.
రాష్ట్రం వద్ద ఉన్న బియ్యం నిల్వలకు సరైన రిజిస్టర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు కావడం లేదని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెలిపింది. ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌తో తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ రికార్డ్స్ పోర్టల్ అనుసంధానం చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా రాష్ట్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు చేయాల్సిన అవసరముంది. తెలంగాణలో పారాబాయిల్డ్ రైస్ వినియోగమే ఉండదు. కానీ పారాబాయిల్డ్ రైస్ ఉత్పత్తి చాలా ఎక్కువగా చేస్తోంది. ఆ ఉత్పత్తిని ఎఫ్.సీ.ఐకి అందిస్తోంది. ఆహారభద్రత చట్టం ప్రకారం మిగులు నిల్వలున్న రాష్ట్రాల్లో సేకరించి, కొరత ఉన్న రాష్ట్రాలకు సర్దుబాటు చేయడం కోసం ఎఫ్సీఐ సేకరించాల్సి ఉంటుంది. పారాబాయిల్డ్ రైస్‌ను వినియోగించే కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల్లో సెంట్రల్ పూల్ నుంచి తీసుకునే మొత్తం క్రమక్రమంగా తగ్గుతోంది. ఎఫ్‌సీఐ వద్ద ఉన్న పారాబాయిల్డ్ రైస్ నిల్వలు రానున్న 3-4 ఏళ్లకు సరిపోతాయి.. కాబట్టి రాష్ట్రాలను పారాబాయిల్డ్ రైస్ ఇవ్వొద్దని కోరామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న రాష్ట్రాలు తదుపరి పారాబాయిల్డ్ రైస్ ఎఫ్.సీ.ఐకి ఇవ్వబోమని రాతపూర్వకంగా అంగీకారం తెలిపాయి. ఒక్క తెలంగాణ విషయంలో ఇలాంటి సమస్య తలెత్తుతోందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వివరణ ఇచ్చింది.
Read Also…. Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ.. ప్రధాన ఎజెండా ఆ ఒక్కటే..!