Hyderabad: ఇలా ఉన్నారేంట్రా.. చికెన్ లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?

హైదరాబాదీలకు బిర్యానీ అంటే ప్రాణం.. కానీ అదే బిర్యానీ ఒకరి ప్రాణాల మీదకు తెస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం ఒక్క చికెన్ లెగ్ పీస్ లేదనే కారణంతో రాత్రికి రాత్రే ఒక రెస్టారెంట్ రణరంగంగా మారింది. అరుపులు, కేకలు, కర్రలు, రాళ్లతో దాడులు.. చివరకు ఆస్పత్రిలో కుట్లు పడే వరకు వెళ్లింది. అసలు భరత్‌నగర్‌లోని విక్టోరియా రెస్టారెంట్‌లో అర్ధరాత్రి ఏం జరిగింది? అనేది తెలుసుకుందాం..

Hyderabad: ఇలా ఉన్నారేంట్రా.. చికెన్ లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
Customer And Staff Clash Over Biryani Leg Piece

Updated on: May 02, 2026 | 3:22 PM

బిర్యానీ అంటే హైదరాబాద్ వాసులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ అదే బిర్యానీలో ఒక లెగ్ పీస్ లేదనే కారణం చిలికి చిలికి గాలివానలా మారి, ఏకంగా ఒక రెస్టారెంట్‌ను రణరంగంగా మార్చేసింది. భరత్‌నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విక్టోరియా రెస్టారెంట్‌‌కు ఒక కస్టమర్ వచ్చాడు. ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ అడగగా, సిబ్బంది కేవలం నాలుగు సింగిల్ ప్యాక్‌లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిని తీసుకున్న వినియోగదారుడు ఇంటికి వెళ్లి, తిరిగి వచ్చి బిర్యానీలో చికెన్ లెగ్ పీస్‌లు లేవని గొడవకు దిగాడు.

రెస్టారెంట్‌పై దాడి

రెస్టారెంట్ అప్పటికే మూసివేస్తున్నామని, అదనపు ముక్కలు ఇచ్చే అవకాశం లేదని యజమాని చెప్పడంతో వివాదం మొదలైంది. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు కస్టమర్ ఏసీ డైనింగ్ హాల్‌లోని సామాగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా తన స్నేహితులను పిలిపించి యజమాని, సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో యజమాని మోహిన్ సహా పలువురు సిబ్బందికి తీవ్ర రక్తస్రావమైంది. గొడవ సాగుతుండగా తన చేతి గడియారం, సిబ్బంది మొబైల్ ఫోన్లు, పర్సులు పోయాయని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తలకు 8 కుట్లు

సనత్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేశారు. రెస్టారెంట్ యజమాని ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై BNSలోని సెక్షన్ 118(2), సెక్షన్ 324(2) సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు భరత్‌నగర్‌కు చెందిన అరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాము ప్రశ్నించడానికి వెళ్తే రెస్టారెంట్ యజమాని మోహిన్, సిబ్బంది తమను దూషించి, పెద్ద మంచూరియన్ చెంచాతో తలపై కొట్టారని ఆరోపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అరుణ్‌కు కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రిలో 8 కుట్లు పడ్డాయి. తమ మోటార్‌సైకిళ్లను కూడా రెస్టారెంట్ సిబ్బంది ధ్వంసం చేశారని చెప్పాడు. చిన్నపాటి కారణంతో ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం సరికాదని పోలీసులు హితవు పలికారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Follow Us