
నల్లమల అడవి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు అధికారులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. అమ్రబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ సేవలను రేపటి నుంచి మూడు నెలల పాటు తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏడాది సంతానోత్పత్తి కాలంలో సఫారీ కార్యకలాపాలను నిలిపివేయడం ఆనవాయితీ. అదే విధంగా ఈ ఏడాది సైతం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో టైగర్ సఫారీతో పాటు అన్ని రకాల సఫారీ సేవలు అందుబాటులో ఉండవు. ప్రతి ఏడాది వర్షాకాలంలో పులులు, చిరుతలు, జింకలు, ఇతర వన్యప్రాణులు సంతానోత్పత్తి ప్రక్రియలో నిమగ్నమవుతాయి. ఈ సమయంలో అడవిలో మానవ సంచారం తగ్గించడంతో జంతువులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుంది. వాటి సహజ జీవన విధానం కొనసాగడంతో పాటు వాటి పిల్లల సంరక్షణకు సైతం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ కారణంగానే ప్రతి ఏడాది ఈ మూడు నెలల పాటు సఫారీ సేవలను నిలిపివేయడం జరుగుతూ వస్తోంది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోనే అతిపెద్ద అటవీ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ రిజర్వ్ ఫార్టెస్‌లో పులులతో పాటు చిరుతలు, సాంబార్ జింకలు, అడవి ఎద్దులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, అనేక రకాల ఇతర జంతువులు, పక్షులకు అవాసంగా ఉంది. ప్రతి ఏడాది ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అమ్రాబాద్ టైగర్ సఫారీకి వచ్చి స్వేచ్ఛగా సంచరించే పులిని దగ్గరగా ప్రత్యక్షంగా వీక్షిస్తారు. అలాగే దారి పొడవునా నల్లమల అడవి అందాలను ఆస్వాదిస్తారు.
ఇక అక్టోబర్ 1 నుంచి అమ్రాబాద్ టైగర్ సఫారీ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. సఫారీకి వెళ్లాలనుకునే పర్యాటకులు తమ ప్రయాణ ప్రణాళికలను ఈ నిర్ణయానికి అనుగుణంగా రూపొందించుకోవాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి పర్యాటకులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.