
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీవో నెం.9ని విడుదల చేసింది. జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే, ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోను సవాలు చేస్తూ..రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వంగా గోపాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత రిజర్వేషన్లు రద్దు చేయకుండా కొత్త రిజర్వేషన్లు కల్పిస్తున్నారని..అవి కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా 50 శాతానికి మించి ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు దృష్టి తీసుకొచ్చారు. ఆ పిటిషన్‌పై ఇప్పటికే ప్రాధమిక విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు అనుకూలంగా హైకోర్టులో మొత్తం 7 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌తో పాటు బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, మెట్టు సాయి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేయగా లేటెస్ట్‌గా కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్, ఇందిరా శోభన్, చరణ్ యాదవ్ కూడా ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు.
కోర్టు విచారణ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. హైకోర్టులో వాదనలు వినిపించాల్సిందిగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. కోర్టులో వినిపించాల్సిన వాదనలపై మంత్రులు, పార్టీ సీనియర్లతో చర్చించారు ముఖ్యమంత్రి. మరోవైపు కోర్టు విచారణ నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇంట్లో సమావేశమయ్యారు బీసీ ముఖ్యనేతలు. తమ వాదనను న్యాయస్థానంలో సమర్ధవంతంగా వినిపించాలని సమావేశంలో నిర్ణయించారు.
తెలంగాణలో బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసిన ప్రత్యేక కమిషన్..ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతం ఉన్నప్పటికీ.. వారికి రాజకీయంగా ఆ మేరకు ప్రాతినిధ్యం లేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వారికి కనీసం 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. దీంతో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం. అయితే ఆ తీర్మానం ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్‌లోనే ఉంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతూ జీవో నెం. 9ని విడుదల చేసింది ప్రభుత్వం.
అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటుతుండటంతో ఈ జీవో న్యాయస్థానంలో ఏ మేరకు నిలబడుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కోర్టులో కేసు ఉండగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడుతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఒక వేళ హైకోర్టులో ప్రతికూల ఫలితం వస్తే భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..