అయ్యో పాపం..! ఆడుకుంటూ ఆముదం గింజలు తిన్న పిల్లలు.. మరుసటి రోజు ఏమైందంటే?

ఆదిలాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాదిగూడ మండలం లోకారి (బి) గ్రామంలో రోడ్డుపై పడి ఉన్న ఆముదం గింజలను తిన్న ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, తలతిరుగుడు రావడంతో కుటుంబ సభ్యులు వారిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల్లో ఉండే రిసిన్ అనే విషపదార్థం ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

అయ్యో పాపం..! ఆడుకుంటూ ఆముదం గింజలు తిన్న పిల్లలు.. మరుసటి రోజు ఏమైందంటే?
Castor Seeds Poisoning

Edited By:

Updated on: Nov 22, 2026 | 10:21 AM

ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తెలియక ఆముదం గింజలు తినడంతో ఆరుగురు పిల్లలు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి (బి) గ్రామంలో కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆరుగురు చిన్నారులకు మార్గమధ్యలో ఓ ఆముదం చెట్టు కనిపించింది. చెట్టు కింద రాలిపడిన కాయలను చూసిన పిల్లలు.. వాటిని రాళ్లతో పగలగొట్టి లోపల ఉన్న గింజలను తిన్నారు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఇళ్లకు చేరుకుని భోజనం చేసి నిద్రపోయారు.

అయితే, శనివారం ఉదయం సీన్ మారిపోయింది. ఒక్కొక్కరిగా చిన్నారులకు వాంతులు, విరేచనాలు, తలతిరుగుడు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఏర్మా ఇంద్ర అనే చిన్నారి తాము ఆముదం కాయలు తిన్నట్లు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. కాయలు పగలగొట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆరుగురు చిన్నారులను ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అస్వస్థతకు గురైన వారిలో పెందూర్ అభిమన్ (6), ఇంద్రుబాయి (6), దుర్గాబాయి (4), ధనుష్ (5), జంగు (5), పల్లవి (3) ఉన్నారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం నిలకడగా ఉందని గ్రామ పెద్ద మాడావి చంద్రహరి తెలిపారు. చిన్నారులకు తెలియని విషపదార్థాలపై అవగాహన లేకపోవడం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

ఆముదం గింజలు ఆముదం నూనెకు ప్రధాన వనరు అయినప్పటికీ, వీటిలో రిసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విష పదార్థం ఉంటుంది. అందువల్ల గింజలను నేరుగా తినడం లేదా నమలడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us