కిలోల కొద్దీ బంగారం.. కోట్లు విలువైన ఆస్తులు.. లెక్కలు తేల్చలేక ఏసీబీ షాక్.. అసలెవరీ కిషన్ నాయక్..?

అతనో ప్రభుత్వ ఉన్నతాధికారి.. కానీ ఆలోచనలన్నీ అండర్ వరల్డ్ మాఫియా రేంజ్‌లో ఉంటాయి. తన హోదాను అడ్డు పెట్టుకుని దొరికిన కాడికి దోచేశాడు. ఏ రోజైనా ఏసీబీ తలుపు తడుతుందని కూడా ముందే ఊహించాడు. ఆ ఏసీబీ కళ్లు కప్పడానికి ఆయన వేసిన ఎత్తుగడలు సినిమా స్క్రీన్ ప్లేను తలపిస్తున్నాయి. కానీ, 'చట్టం కళ్లు' అంత ఈజీగా మోసపోవని కిషన్ నాయక్ ఎపిసోడ్ నిరూపించింది.

కిలోల కొద్దీ బంగారం.. కోట్లు విలువైన ఆస్తులు.. లెక్కలు తేల్చలేక ఏసీబీ షాక్.. అసలెవరీ కిషన్ నాయక్..?
Transport Deputy Commissioner Kishan Naik Arrest

Updated on: Dec 24, 2025 | 7:17 AM

అతనో ప్రభుత్వ ఉన్నతాధికారి.. కానీ ఆలోచనలన్నీ అండర్ వరల్డ్ మాఫియా రేంజ్‌లో ఉంటాయి. తన హోదాను అడ్డు పెట్టుకుని దొరికిన కాడికి దోచేశాడు. ఏ రోజైనా ఏసీబీ తలుపు తడుతుందని కూడా ముందే ఊహించాడు. ఆ ఏసీబీ కళ్లు కప్పడానికి ఆయన వేసిన ఎత్తుగడలు సినిమా స్క్రీన్ ప్లేను తలపిస్తున్నాయి. కానీ, ‘చట్టం కళ్లు’ అంత ఈజీగా మోసపోవని కిషన్ నాయక్ ఎపిసోడ్ నిరూపించింది. కిషన్ నాయక్ ‘బ్రెయిన్’ కంటే ఏసీబీ నెట్‌వర్క్ వేగంగా పని చేసి ఉచ్చు బిగించింది. అసలెవరీ కిషన్ నాయక్..? కూడబెట్టిన ఆక్రమాస్తులు ఎన్ని..? తప్పించుకోవడానికి వేసిన ఎత్తులు ఏంటి..?

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో మహబూబ్‌నగర్‌ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ రవాణాశాఖ ఆఫీసులో బస్సులు, లారీలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌.. ఇలా ఏ పని కావాలన్నా కిషన్‌ నాయక్‌ చేయి తడపాల్సిందే. ప్రతి పనికీ ఓ రేటు ఉటుంది. ఈ వ్యవహారాల్లో ఎక్కడా అధికారులు, ఉద్యోగుల పాత్ర ప్రత్యక్షంగా కనిపించదు. ఇక్కడ ఏజెంట్లు, డీలర్లు కీలకం. వాళ్లతోనే డీల్‌ సెటిల్‌ అవుతోంది. ఇలా అవినీతికి కేరాఫ్‌గా మారిన కిషన్‌ నాయక్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌లో జిల్లాలతో పాటు ఏకకాలంలో 15 చోట్ల జరిగిన సెర్చ్‌ ఆపరేషన్‌లో అక్రమాస్తుల ఆస్తుల లెక్కలు తేలాయి.

గతంలో హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌లో పని చేసిన కిషన్‌ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. “దొరకనంత వరకు దొరనే” అనే ధీమాతో ఆయన వేసిన ఎత్తుగడలను చూసి ఏసీబీ అధికారులే ముక్కున వేలేసుకున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ హోదాను అడ్డుపెట్టుకుని తాను ఎంత దోచుకుంటున్నాడో కిషన్‌ నాయక్‌కు తెలుసు. తన సంపాదనకు తన ఆస్తుల విలువకు ఎక్కడ కూడా పొంతన లేదని కూడా తెలుసు. అందుకే ఏ రోజైనా ఏసీబీ తలుపు తడుతుందని ముందే ఊహించాడు. ఏ క్షణమైనా ఏసీబీ రైయిడ్‌ జరుగుతుందని వారం ముందే ‘సిగ్నల్స్’ అందాయి. అందుకే తన నివాసంలో నయా పైసా దొరకకుండా ముందస్తుగా ‘సేఫ్ గేమ్’ ఆడాడు. తన ఇంట్లో ఒక్క ఆస్తి పత్రం కూడా ఉంచలేదు. అన్నింటినీ తన స్నేహితుడి ఇంట్లో భద్రపరిచాడు. ఇంట్లో బంగారం ఉంటే దొరికిపోతామని, దాన్ని తెలివిగా ఒక జ్యువెలరీ షాపులో పెట్టాడు. దొరక్కుండా ప్లాన్స్‌ గీసినా.. ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారు.

ఏసీబీ అధికారులు ఈ వేటను ఇప్పుడు మొదలుపెట్టలేదు. కిషన్‌ నాయక్‌ పని చేసిన ప్రతిచోట అవినీతి వేళ్లూనుకుపోయిందని తెలిసి.. ఆరు నెలల నుంచి అతని ప్రతి కదలికపైనా నిఘా పెట్టారు. ఆయన ఎవరిని కలుస్తున్నాడు? ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు? డబ్బులు ఎక్కడికి మళ్లుతున్నాయి? తన ఆర్థిక లావాదేవీల వివరాలు ఏంటి..? ఇలా ప్రతీది గమనిస్తూ వచ్చారు. స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఆస్తి పత్రాలు, షాపులకు చేరిన బంగారం.. ఈ మొత్తాన్ని ఏసీబీ సైలెంట్ గా ట్రాక్ చేసింది. ఆయన జిమ్మిక్కులను గమనిస్తూ సరైన సమయం కోసం వేచి చూసి.. ‘మెరుపు దాడి’తో ఉచ్చు బిగించారు.

కిలోల కొద్దీ బంగారం.. కోట్ల ఆస్తులు.. ఎకరాల కొద్దీ భూములు.. అపార్ట్‌మెంట్, హోటల్, ఫర్నీచర్ షోరూమ్.. ఇవన్నీ ఒక సాదాసీదా అధికారి సంపాదించడం వెనుక ఉన్న అవినీతిని ఏసీబీ ఇప్పుడు బయటకు తీసింది. డాక్యుమెంట్ల ప్రకారం 50 కోట్ల రూపాయల విలువ అనుకుంటే.. ప్రస్తుతం బయట ఉన్న మార్కెట్ విలువ ప్రకారం రూ. 100 కోట్లకు పైమాటేనని అంచనా వేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..