
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరినొకరు కలుసుకునే సమయమే కరువైంది. ఉమ్మడి కుటుంబం అనేది ఒక కలగా మిగిలిపోతున్న తరుణంలో, వసుధైక కుటుంబ సంప్రదాయాన్ని కాపాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెలటూర్ గ్రామానికి చెందిన భూజల అక్కిరెడ్డి – నరసమ్మ కుటుంబ. ఈ ఫ్యామిలీ గత రెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా మరోసారి ఐదు తరాలకు చెందిన కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి ఘనంగా ఐదు తరాల అపురూప ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఒకే ఫ్రేమ్‌లో 5 తరాలు..
వివిధ ప్రాంతాలలో స్థిరపడిన ఈ కుటుంబానికి చెందిన మొత్తం 135 మంది సభ్యులలో.. దాదాపు 120 మంది ఒకే చోటుకు చేరుకున్నారు. ముత్తాతలు, ముత్తవ్వల నుండి మొదలుకొని నిన్న మొన్న పుట్టిన పసిపాపల వరకు అందరూ ఒకే వేదికపై కలవడం అక్కడ ఒక అద్భుతమైన, భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. ముత్తవ్వ, ముత్తాత, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, అమ్మానాన్నలు, కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో సహా ఐదు తరాల ప్రతినిధులంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో నిలిచి ప్రత్యేకంగా తీసుకున్న గ్రూప్ ఫొటో ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆటపాటలతో సందడి..
సంవత్సరమంతా బిజీ లైఫ్‌లో గడిపే కుటుంబ సభ్యులంతా, ఈ ఒక్కరోజూ తమ బాధ్యతలను పక్కనపెట్టి ఆటపాటలతో, ఆత్మీయ పలకరింపులతో ఎంతో ఉల్లాసంగా గడిపారు. మరుగున పడిపోతున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సరికొత్త మధుర స్మృతులను మూటగట్టుకున్నారు.
రాబోయే తరాలకు ఆదర్శం
ఈ ఐదు తరాల కలయిక అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. మా కుటుంబ చరిత్రలో ఇదొక సువర్ణ ఘట్టమని భూజల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నేటి ఆధునిక కాలంలో అమ్మానాన్నలను వదిలి ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్న వారికి, ఈ తరం పిల్లలకు బంధుత్వాల విలువలు తెలియజెప్పడానికే ఈ ప్రయత్నం. ఇలాంటి సమ్మేళనాల ద్వారా రాబోయే తరాలకు కుటుంబ విలువలపై గౌరవం, ప్రేమ పెరుగుతాయి. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి ఆత్మీయ కలయికలు జరగాలి వారు చెప్పుకొచ్చారు.
కాలంతో పోటీపడే ఈ ఆధునిక కాలంలో అందరూ కలిసి ఉండడం ఒక కలే. జీవన ఉపాధి ప్రయాణంలో అమ్మానాన్నలు వీడి ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు. అలాంటి వారికి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది. మరుగునపడిపోతున్న బంధుత్వాలు బలంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.