నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం వాడి గ్రామంలో ఓ కుటుంబాన్ని తీరని విషాదం వెంటాడింది. 10 రోజుల వ్యవధిలోనే భార్యభర్తలతో పాటు వారి కుమారుడు మృత్యువాత పడ్డారు. లింబాద్రి, కనకవ్వ భార్యభర్తలు. వారికి ఇద్దరు కుమారులు. కాపురాలు వేర్వేరు అయినా తల్లిదండ్రులకు తోడుగా పక్క పక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. అయితే పెద్దకొడుకు రెండు సంవత్సరాలుగా మూత్ర సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కిడ్నీలు చెడిపోవడంతో.. తరచూ డయాలసిస్ చేయించుకునే వాడు. ఈ క్రమంలో ఈనెల 4న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈనెల 6న మృతిచెందాడు. అతను చనిపోయిన పదిరోజులకే తల్లి కనకవ్వ ఆకస్మాత్తుగా మృత్యువాత పడింది. ఆమె చనిపోయి 24 గంటలు కాకముందే.. లింబాద్రి కూడా తుదిశ్వాస విడిచాడు.
ఇలా ముగ్గురు వరుసగా చనిపోవడం గ్రామంలో తీరని విషాదాన్ని నింపింది. లింబాద్రి రెండో కుమారుడు సుదర్శన్ నాలుగునెలల క్రితమే.. పొలం పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఇలా నాలుగునెలల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం…స్థానికులను కలిచివేసింది. ఇటీవల మృతిచెందిన ముగ్గురికీ కరోనా లేదు. మూత్రవ్యాధితో కుమారుడు చనిపోతే.. హైబీపీతో తల్లి, మనస్థాపంతో తండ్రి చనిపోయాడు. కానీ వారి ముగ్గురి మరణం వెనుక వైరస్ ఉందన్న అనుమానం.. గ్రామస్తులను వణికిస్తోంది. భయంతో డీఎంహెచ్‌వోకు విన్నవించారు. దాంతో ప్రత్యేక వైద్యబృందంతో.. గ్రామంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించారు. బాధిత కుటుంబసభ్యులతో పాటు ఊళ్లో ఉన్న అందరికీ ఈ టెస్టులు జరిపించారు. కానీ ఊహించని విధంగా విధి.. ఓ కుటుంబం మొత్తాన్ని లేకుండా చేయడంపై పగవారికి కూడా ఈ పరిస్థితి రాకూడదని ప్రజలు వేడుకుంటున్నారు. మొన్నటి వరకు కళ్లెదుట ఉన్న వాళ్లు ఇప్పుడు లేకపోయేసరికి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: ఆ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో తెరుచుకుంటే.. వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటుంది
విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు