
ప్రముఖ కార్ల తయారీ సంస్థ Suzuki ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో కొత్త మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. గతంలో పెట్రోల్ కారుగా అందుబాటులో ఉన్న Ignisను ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో పరిచయం చేస్తోంది. 2025 Japan Mobility Showలో ప్రదర్శించిన Vision e Sky కాన్సెప్ట్ ఆధారంగా ఈ కొత్త EVని అభివృద్ధి చేసింది. జపాన్‌లో నవంబర్ 16న e Sky పేరుతో విడుదల చేసిన ఈ కారును అంతర్జాతీయ మార్కెట్లలో Ignis పేరుతో విక్రయించనుంది. 2027 సమ్మర్ నుంచి యూరప్‌తో పాటు ఇతర మార్కెట్లలో అందుబాటులోకి రానుంది.
కొత్త Suzuki Ignis EVలో 26kWh సామర్థ్యం కలిగిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 310 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో ఫ్రంట్ వీల్స్‌కు పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఇది 91hp పవర్, 133Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు కేవలం 25 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 3kW AC ఛార్జర్‌తో 8 గంటలు, 6kW AC ఛార్జర్‌తో 4.5 గంటల్లో 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది.
డిజైన్ విషయానికి వస్తే బాక్సీ ఆకృతి, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ప్రత్యేకమైన LED DRLలు, బ్లాక్ క్లోజ్డ్ గ్రిల్ ఆకట్టుకుంటాయి. సిల్వర్ ఫినిషింగ్ బంపర్, 15 అంగుళాల బ్లాక్ రిమ్స్, వీల్ ఆర్చ్‌ల చుట్టూ క్లాడింగ్, LED టెయిల్‌ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్ కూడా ఉన్నాయి. ఈ కారు పొడవు 3,570 మి.మీ., వెడల్పు 1,565 మి.మీ., ఎత్తు 1,635 మి.మీ. కాగా, వీల్‌బేస్ 2,460 మి.మీ., గ్రౌండ్ క్లియరెన్స్ 150 మి.మీ.గా ఉంది.
క్యాబిన్‌లో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. మూడు స్పోక్‌ల స్టీరింగ్ వీల్, ఫిజికల్ బటన్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందించారు. సెంటర్ కన్సోల్‌లో 45W ఛార్జింగ్ పోర్టులు, స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, Vehicle-to-Load (V2L) సపోర్ట్ వంటి సదుపాయాలు కూడా ఉండే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో Ignis EV విడుదలపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ Maruti Suzuki ఈ కారును భారత్‌కు తీసుకొస్తే కొత్త పేరుతో పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన Ignisకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోవడంతో 2026 ఏప్రిల్‌లో దాని విక్రయాలను నిలిపివేశారు. దీంతో కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ను భారత్‌కు తీసుకొస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.