Spinach send emails: యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలో కాలుష్యం ఒకటి. ముఖ్యంగా పంటలకు పెద్ద మొత్తంలో రసాయనాలు ఉపయోగిస్తుండడంతో భూమి కాలుష్యానికి గురై భూసారం దెబ్బతింటోంది. అయితే ఈ విషయాన్ని అంత సులభంగా గుర్తించలేము. అందులోనూ ప్రతీసారి భూమి, అందులోని నీటిని పరీక్షించడం కాస్త కష్టంతో కూడుకున్న విషయం.
అలా కాకుండా భూమిలో పెరిగే మొక్క.. కాలుష్య స్థాయి పెరిగిన వెంటనే అలర్ట్ చేస్తూ మీ కంప్యూర్‌కు ఓ మెయిల్‌ని పంపిస్తే ఎలా ఉంటుంది. ఏంటీ… మొక్క కంప్యూటర్‌కు మెయిల్ పంపడమేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ..! కానీ మీరు చదివింది నిజమే.. దీన్ని నిజం చేసి చూపించారు అమెరికాలోని మసాచు సెట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు. ఇందుకోసం పరిశోధకులు పాల కూర మొక్కల్లో ఫ్లోరో సెంట్ నానో సెన్సార్‌తో కూడిన కార్భన్ నానో ట్యూబ్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఆ మొక్క భూమి నుంచి వినియోగించుకునే మృతిక, నీటి ద్వారా ఏవైనా కాలుష్య పదార్థాలు మొక్కలోకి ప్రవేశించిన వెంటనే.. నానో ట్యూబ్‌లో ముందుగానే ప్రోగ్రామ్ చేసి పెట్టిన మెయిల్ కంప్యూటర్‌కు చేరవేస్తుంది. దీనిబట్టి సదరు మొక్క పెరుగుతోన్న ప్రాంతంలోని భూమిలో కాలుష్య స్థాయి పెరిగిందని గుర్తించవచ్చన్నమాట. పరిశోధకుల ఈ ఆలోచన నిజంగా అద్భుతం కదూ..!