US spacecraft: 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై మరోసారి అడుగుపెట్టిన అమెరికా..

అంతరిక్షంలో సగానికి పైగా మేమే అంటూ డప్పు కొట్టుకుంటున్న అమెరికా.. యాబైఏళ్ల తర్వాత మరోసారి చందమామను ముద్దాడింది. ఒక ప్రైవేట్ ఏజెన్సీ సాయంతో దక్షిణ ధృవంపై కాలుమోపి... ఒక విధంగా చంద్రయాన్‌ రికార్డును కూడా బ్రేక్ చేసింది. కాకపోతే.. ల్యాండింగ్ సమయంలో బాగా ఆయాసపడింది అమెరికా. ఒకేఒక్క ట్రిక్‌.. గండం నుంచి ఆ ప్రయోగాన్ని గట్టెక్కించి.. జెండా ఎగరేసింది. ఏమిటా ట్రిక్.. ఎవరు చేశారు ఆ మేజిక్..?

US spacecraft: 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై మరోసారి అడుగుపెట్టిన అమెరికా..
Odysseus (Intuitive Machines)

Updated on: Feb 23, 2024 | 6:12 PM

ఇస్రోవారి చంద్రయాన్-3 సాధించిన విజయమే స్పూర్తిగా.. ప్రపంచ వ్యోమగాములందరూ జాబిలి వైపే ఆశగా చూస్తున్నారు. జాబిలితో చెప్పనా అంటూ జామురాతిరి కలలు కంటున్నాయి దేశాలన్నీ. మూలనపడ్డ మూన్‌మిషన్స్ అన్నీ ఒక్కసారిగా మేలుకుంటున్నాయి. ఇటీవలే జనవరి నెల్లో జపాన్ దేశపు మూన్ స్నైపర్ ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు అమెరికాకు చెందిన ఇన్‌ట్యూటివ్ మెషీన్స్‌ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’ చంద్రునిపై సురక్షితంగా వాలింది.

1972లో అపోలో మిషన్‌ పేరుతో నాసా చేపట్టిన చంద్ర మండల యాత్ర తర్వాత ఇదే అమెరికా ఖాతాలో తొలి మూన్‌ మిషన్‌ విక్టరీ. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా నపిచేసే ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ.. ఇన్‌ట్యూటివ్ మెషిన్స్. నాసా ఇచ్చిన 118 మిలియన్‌ డాలర్ల ఫండింగ్‌తో ఒడిస్సియస్‌ను చంద్రుడిమీదకు పంపింది. అమెరికన్ టైమ్ ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకు.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుఝామున 4 గంటల 53 నిమిషాలకు క్షేమంగా జాబిలిపై వాలి.. అయ్యామ్ సేఫ్ అని సంకేతాలిచ్చింది ‘ఒడిస్సియస్’.

ఒడిస్సియన్‌ కాలుమోపిన బిలం పేరు మాలాపెల్ట్ A. చంద్రుడి సౌత్‌పోల్‌కి 300 కిలోమీటర్ల దూరంలో ఏర్పడ్డ చిన్న గొయ్యి. దక్షిణ ధ్రువానికి అత్యంత చేరువలో దిగిన వ్యోమనౌకగా చరిత్రకెక్కింది ఒడిస్సియన్‌. ఈవిధంగా చంద్రయాన్‌-3 విక్రమ్ ల్యాండర్‌ రికార్డును బద్దలుకొట్టేసింది.

100 కిలోల బరువులో సిలిండర్ ఆకారంతో టెలిఫోన్ బూత్‌ని పోలిన ఒడిస్సియస్.. ఐదు నాసా పరికరాల్ని, మరికొన్ని వాణిజ్య సంస్థలకు చెందిన పేలోడ్స్‌ని మోసుకెళ్లింది. జపాన్ స్లిమ్ ల్యాండర్‌లా తలకిందులుగా కాకుండా నిటారుగానే దిగిందని, డేటా పంపడం కూడా మొదలైందని కన్‌ఫమ్ చేసింది ఇన్‌ట్యూటివ్ మెషీన్స్. కానీ.. ల్యాండింగ్‌ సమయంలో బాగా తడబడింది ఒడిస్సియస్.

ల్యాండర్ నేవిగేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తి.. మిషన్ కంట్రోల్ సెంటర్‌లో సైంటిస్టుల్ని కలవరపెట్టింది. కానీ, సమయస్పూర్తితో ట్రబుల్ షూట్ చేయడంతో.. నిర్దేశిత సమయం కంటే కొంత ఆలస్యంగానైనా సురక్షితంగానే ల్యాండైంది. నాసా తయారుచేసిన డాప్లర్ లిడార్ అనే ఒక స్పెషల్ పేలోడ్‌దే ఇక్కడ కీలకపాత్ర. దాని సహకారం వల్లే సేఫ్‌ల్యాండింగ్ సాధ్యమైంది. ఇందులోని రెండు లేజర్స్‌ సాయంతో… ల్యాండర్‌లో పనిచేయని భాగాన్ని ఉత్తేజపరిచారు ఇన్‌ట్యూటివ్ ఇంజనీర్లు. ఈవిధంగా ఒడిస్సియస్‌ను మళ్లీ వర్క్‌మోడ్‌లోకి తీసుకొచ్చింది, తాజా మూన్ మిషన్‌ని సక్సెస్‌ఫుల్‌గా మార్చింది నాసా వారి ప్రత్యేక పరికరం.

యాభై ఏళ్ల తర్వాత చంద్రుడిపై పడ్డ అగ్రరాజ్యపు ముద్ర శాశ్వతమా కాదా తేలాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే ఒడిస్సియస్‌ లైఫ్‌టైమ్ ఏడు రోజులే. ల్యాండింగ్ సమయంలో జరిగిన గడబిడ.. ల్యాండింగ్ తర్వాత బలహీన సిగ్నల్స్‌.. ఇవన్నీ కలిపి ల్యాండర్ ఫ్యూచర్‌పై కన్‌ఫ్యూజన్ పెంచేస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి