
ప్రముఖ బ్రాండ్ JBL.. ఆడియో మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. స్పీకర్లు, హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్స్ వంటి ఆడియో ఉత్పత్తులతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రీమియం సౌండ్ క్వాలిటీ అందిస్తూ తమ ఉత్పత్తులకు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగింది. మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రోడక్ట్స్ లాంఛ్ చేస్తూ కస్టమర్లకు బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు యూత్‌ను టార్గెట్ గా సరికొత్త ఇయర్ బడ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
JBL Tune Buds 3 పేరుతో రిలీజ్ చేసిన ఇవి.. సాధారణ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా లోపలి భాగాలు కనిపించేలా సెమీ ట్రాన్స్లూసెంట్ డిజైన్‌తో రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతే కాకుండా బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ, 48 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదలైన ఈ ఇయర్ బడ్స్ ధరను 729 యువాన్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.8,500 నుంచి రూ.9,200 మధ్య ఉంటుంది. చైనాలో డిసెంబర్ 3 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ పూర్తి ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం..
డిజైన్..
ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా యూత్‌ను ఆకట్టుకునే స్టైలిష్ లుక్‌తో JBL Tune Buds 3ను రూపొందించారు. ఈ ఇయర్‌బడ్స్‌తో పాటు ఛార్జింగ్ కేస్ కూడా సెమీ ట్రాన్స్లూసెంట్ ఫినిషింగ్‌తో వస్తుంది. దీంతో లోపల ఉండే సర్క్యూట్, ఇతర భాగాలు బయటకు కనిపిస్తాయి. ప్రతి ఇయర్‌బడ్ బరువు కేవలం 5.9 గ్రాములు మాత్రమే ఉండగా.. ఛార్జింగ్ కేస్ బరువు 40 గ్రాములుగా ఉంది. ఎక్కువసేపు చెవుల్లో పెట్టుకున్నా అసౌకర్యం కలగకుండా తేలికపాటి డిజైన్‌తో వీటిని తయారు చేశారు.
కలర్స్..
ఇవి డీప్ బ్లాక్, మూన్ వైట్, జేడ్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.
సేఫ్టీ..
దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్ అందించారు. జిమ్‌లో వర్కవుట్స్ చేసేటప్పుడు లేదా వర్షంలో ప్రయాణించేటప్పుడు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు.
హార్మన్ ట్యూన్డ్ సౌండ్..
సౌండ్ క్వాలిటీ విషయంలో JBL ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ఇయర్‌బడ్స్‌లో 10mm డైనమిక్ డ్రైవర్లను అందించింది. వీటిని హార్మన్ ఆడియో ఇంజనీర్లు ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. దీంతో JBL సిగ్నేచర్ ప్యూర్ బాస్ సౌండ్‌తో పాటు స్పష్టమైన వోకల్స్ వినిపిస్తాయి. సినిమాలు చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మెరుగైన ఆడియో అనుభూతిని అందిస్తుంది.
Personi-Fi 3.0..
ఈ ఇయర్‌బడ్స్‌లో మరో ప్రత్యేకత Personi-Fi 3.0 ఫీచర్. వినియోగదారుల వినికిడి సామర్థ్యానికి అనుగుణంగా ఆడియో అనుభూతిని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. JBL Headphones యాప్ ద్వారా నచ్చిన విధంగా ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను కూడా మార్చుకోవచ్చు.
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్..
బయట రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు చుట్టుపక్కల శబ్దాలు ఇబ్బంది పెట్టకుండా ఇందులో ట్రూ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ను అందించారు. ఇందులోని మైక్రోఫోన్లు బయటి శబ్దాలను గుర్తించి వాటిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇయర్‌బడ్స్ తీయకుండానే పక్కవారితో మాట్లాడేందుకు స్మార్ట్ యాంబియంట్ మోడ్ ఉపయోగపడుతుంది.
క్లియర్ కాల్స్..
ఫోన్ కాల్స్ కోసం మొత్తం ఆరు మైక్రోఫోన్లను అందించారు. ఇవి గాలి శబ్దాన్ని తగ్గించి, అవతలి వ్యక్తికి మీ గొంతు స్పష్టంగా వినిపించేలా పనిచేస్తాయి.
బ్లూటూత్ 6.0..
కనెక్టివిటీ పరంగా JBL Tune Buds 3లో బ్లూటూత్ 6.0 టెక్నాలజీని ఉపయోగించారు. ఇది వేగవంతమైన కనెక్షన్‌తో పాటు మెరుగైన పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుంది.
మల్టీ పాయింట్ కనెక్టివిటీ..
ఈ సదుపాయం ద్వారా ఒకేసారి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ వంటి రెండు పరికరాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫాస్ట్ పెయిర్, ఆరాకాస్ట్ ఫీచర్లకు కూడా సపోర్ట్ ఉంది. దీంతో కనెక్టివిటీ విషయంలో వినియోగదారులకు మరింత సౌలభ్యం లభిస్తుంది.
బ్యాటరీ..
ఈ ఇయర్‌బడ్స్‌లో మరో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ సామర్థ్యం. ఛార్జింగ్ కేస్‌తో కలిపి గరిష్ఠంగా 48 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ANC ఆఫ్‌లో ఉన్నప్పుడు ఇయర్‌బడ్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 12 గంటల వరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మరో 36 గంటల బ్యాకప్ లభిస్తుంది. అదే ANC ఆన్‌లో ఉంటే ఇయర్‌బడ్స్ 10 గంటలు, ఛార్జింగ్ కేస్ మరో 30 గంటల బ్యాకప్ అందిస్తాయి. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే నాలుగు గంటల వరకు మ్యూజిక్ వినొచ్చు. పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.
గమనిక.. భారత మార్కెట్లో విడుదలకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెల్లడికాలేదు.