
ఒకప్పుడు మనుషులు పరిచయమయ్యేది కుటుంబాల ద్వారా, స్నేహితుల ద్వారా, ఉద్యోగాల ద్వారా. ఇప్పుడు ఆ స్థానాన్ని సోషల్ మీడియా ఆక్రమించింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ వంటి వేదికలు లక్షలాది మంది జీవితాల్లో భాగమయ్యాయి. ఒక ఫాలో, ఒక లైక్, ఒక కామెంట్, ఒక డీఎం… ఇలా మొదలయ్యే పరిచయాలు చాలా సందర్భాల్లో స్నేహంగా, ప్రేమగా, వ్యాపారంగా మారుతున్నాయి. కానీ అదే మార్గం ఇప్పుడు నేరాలకు కూడా కొత్త గేట్‌వేగా మారుతోంది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ట్రైనీ ఐపీఎస్ అధికారిణి కేసు దేశవ్యాప్తంగా మరోసారి సోషల్ మీడియా పరిచయాల ప్రమాదాన్ని గుర్తు చేసింది. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న అనేక కేసుల్లో మొదటి లింక్ సోషల్ మీడియానే కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటి నేరస్థుడు కత్తి పట్టుకుని రావడం లేదు. ముందుగా మీ ప్రొఫైల్‌ను చూస్తాడు. మీ ఫొటోలు, అభిరుచులు, స్నేహితులు, ఉద్యోగం, కుటుంబం… అన్నీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఒక మెసేజ్.
“హాయ్…”
అక్కడి నుంచి మొదలయ్యేది ఒక మానసిక ఆట.
మొదట స్నేహం. తర్వాత నమ్మకం. ఆ తర్వాత వ్యక్తిగత చర్చలు.వీడియో కాల్స్. ఫొటోలు. చివరికి బ్లాక్‌మెయిల్, డబ్బు డిమాండ్, లైంగిక వేధింపులు లేదా హత్య వరకు వెళ్లిన కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇది ఇప్పుడు సోషల్ మీడియా నేరాల కామన్ ప్యాటర్న్.
సోషల్ మీడియా → పరిచయం → నమ్మకం → వ్యక్తిగత సమాచారం → ప్రత్యక్ష భేటీ → నేరం
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, రీల్స్, స్టోరీలు, లొకేషన్‌లు, ఫాలోవర్లు… ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి చాలానే సమాచారం ఉంటుంది. అదే సమాచారాన్ని ఉపయోగించి.. ప్రేమ పేరుతో దగ్గరవడం, నకిలీ ప్రొఫైల్‌లు సృష్టించడం, మార్ఫింగ్, వీడియో కాల్ రికార్డింగ్, సెక్స్టార్షన్, పెట్టుబడి మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, డీప్‌ఫేక్ వీడియోలు పెరుగుతున్నాయని దర్యాప్తు సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఈ భయం ఊహ కాదు.. గణాంకాలు చెబుతున్న వాస్తవం. NCRB (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) ప్రకారం.. 2023లో దేశవ్యాప్తంగా 65 వేలకుపైగా సైబర్ నేరాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇవి 20 శాతానికి పైగా పెరిగాయి. అందులో 10 వేలకుపైగా కేసులు మహిళలను లక్ష్యంగా చేసుకున్నవే. 2024లో దేశవ్యాప్తంగా 1,01,928 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. 2025లో మాత్రం National Cyber Crime Reporting Portalకు వచ్చిన ఫిర్యాదులు 28 లక్షలు దాటడం, ఆన్‌లైన్ మోసాల తీవ్రత మరింత పెరుగుతున్న సంకేతంగా అధికారులు చెబుతున్నారు. 2025కు సంబంధించిన అధికారిక NCRB ‘Crime in India’ నివేదిక ఇంకా విడుదల కాలేదు.
ఇది కేవలం గణాంకం కాదు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం, ఒక బాధితుడు, ఒక ఆర్థిక నష్టం లేదా ఒక మానసిక వేదన ఉంది. ఫేక్ ప్రొఫైల్‌లు, సోషల్ మీడియా వేధింపులు, రొమాన్స్ స్కామ్‌లు, హనీ ట్రాప్‌లు, సెక్స్‌టార్షన్, మార్ఫింగ్, సైబర్ స్టాకింగ్ వంటి కేసులు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి.
భారత ప్రభుత్వ Indian Cyber Crime Coordination Centre (I4C) ప్రకారం.. 1930 సైబర్ హెల్ప్‌లైన్ ప్రారంభమైన తర్వాత లక్షలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. వేల కోట్ల రూపాయల ఆన్‌లైన్ మోసాలను అధికారులు గుర్తించారు. ప్రత్యేకంగా Instagram, Facebook వంటి వేదికల ద్వారా జరిగే Romance Scam, Honey Trap, Investment Scam కేసులు గణనీయంగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు.
Meta Transparency Reports ప్రకారం.. భారత్‌లో ప్రతి నెల లక్షలాది ఫేక్ అకౌంట్లను తొలగిస్తున్నారు.స్కామ్ నెట్‌వర్క్‌లను గుర్తిస్తున్నారు.
నకిలీ ప్రొఫైల్‌లను బ్లాక్ చేస్తున్నారు. అయినా కొత్త అకౌంట్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ఒక నేరం జరిగితే.. సైబర్ పోలీసులు కేవలం ఫోన్ మాత్రమే చూడరు.
వాళ్లు పరిశీలించేవి..
డిలీట్ చేసిన చాట్ కూడా ఫోరెన్సిక్ టెక్నాలజీ ద్వారా తిరిగి రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కేసుల్లో బాధితులు చెబుతున్న మాట ఒక్కటే.. “మొదట అతను చాలా మంచివాడిలా అనిపించాడు. అదే నేరస్థుడి విజయం. నమ్మకం సంపాదించడం. ఆ తర్వాత ఆ నమ్మకాన్నే ఆయుధంగా మార్చుకోవడం.
సైబర్ నేరాల్లో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు.
“జనం ఏమనుకుంటారు?”
“కుటుంబానికి తెలిసిపోతుంది.”
“నా ఫొటోలు బయటకు వస్తాయి.”
ఈ భయమే నేరస్థులకు బలం.
బాధితుడు మౌనంగా ఉంటే… నేరస్థుడు మరొకరిని వెతుకుతాడు. అందుకే ప్రతి ఫిర్యాదు ఒక వ్యక్తిని మాత్రమే కాదు… భవిష్యత్తులో మరెంతో మందిని కూడా కాపాడుతుంది.
ప్రతి ఫాలో స్నేహం కాదు. ప్రతి డీఎం నిజాయితీ కాదు.ప్రతి ప్రొఫైల్ వెనుక కనిపించే ముఖమే నిజం కాదు. సోషల్ మీడియా ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చింది. కానీ అదే సమయంలో ప్రపంచం నలుమూలల నేరస్థులకు కూడా మన జీవితాల్లోకి ప్రవేశించే తలుపు తెరిచింది. ఇప్పుడు నేరస్థుడు గల్లీలో కనిపించడం లేదు… మన మొబైల్ స్క్రీన్‌లో కనిపిస్తున్నాడు.
ఒక Followతో మొదలైన పరిచయం. ఒక Likeతో పెరిగిన నమ్మకం. ఒక Meetingతో జీవితాన్ని చీకటిలోకి నెట్టే ప్రమాదంగా మారొచ్చు.
డిజిటల్ ప్రపంచంలో ‘Accept’ బటన్ నొక్కే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పు క్లిక్… జీవితాంతం వెంటాడే బాధగా మారవచ్చు.