Instagram parents Guide: సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా టీనేజర్లు సోషల్ మీడియాకు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలోనే లేని పోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా సైట్ల ద్వారా యువతకు ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఇన్‌స్టాగ్రామ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే టీనేజర్ల తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు పేరెంట్స్ గైడ్‌ను రూపొందించింది. దీనిని హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ సదస్సులో ఇటీవల విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల యువత కోసం ప్రత్యేకంగా ఈ గైడ్‌ను విడుదల చేయడం విశేషం.
ఇన్‌స్టాగ్రామ్ అందిస్తున్న అన్ని రకాల భద్రతా పరమైన అంశాలపై టీనేజర్ల తల్లిదండ్రులకు అవగాహన కలిపించడమే ఈ గైడ్ రూపకల్పన ప్రధాన ఉద్ధేశమని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులు తెలిపారు. మారుతున్న సోషల్ మీడియా తీరుపై కూడా ఇది అవగాహన కలిపిస్తుందన్నారు. టీనేజర్ల భధ్రత, హక్కులకు సంబంధించి పనిచేస్తున్న సెంటర్ ఫర్ సోషల్ రిసెర్చ్, సైబర్ పీస్ ఫౌండేషన్, ఆరంభ్ ఇండియా ఇనీషియేటివ్, యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివిటీ సిటిజన్ షిప్., ఇట్స్ ఓకె టూ టాక్, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్.. వంటి సంస్థలు అందించిన వివరాలను ఈ గైడ్‌లైన్స్‌లో పొందుపరిచారు. ఈ గైడ్‌లైన్స్ అవసరం గురించి ఇన్‌స్టాగ్రామ్ ఇండియా పబ్లిక్ పాలసీ అండ్ కమ్యూనిటీ ఔట్‌రీచ్ మేనేజర్ తారాబేడీ మాట్లాడుతూ… ‘పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న ఇలాంటి రోజుల్లో వారు ఉపయోగిస్తున్న ఫీచర్ల గురించి తల్లిదండ్రలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చిన్నారులు సోషల్ మీడియాను సురక్షితంగా వినియోగించుకునేందుకు తోడ్పడుతుంది. యువత ఆన్‌లైన్‌లో భద్రతను మెరుగుపరుచుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్ పలు మార్పులు చేసింది. ముఖ్యంగా రిస్ట్రిక్ట్ అనే ఫీచర్‌తో ఆకతాయిల నుంచి అభ్యంతకరమైన సంభాషణలు మీ చిన్నారులకు చేరకుండా చేయవచ్చు. ఈ విషయం మీ చిన్నారికి కానీ, సదరు ఆకతాయిలకు కానీ తెలియదు’ అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా టీనేజర్ల భద్రత కోసం ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చిన ఈ కొత్త గైడ్‌లైన్ బాగుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Redmi 9c: రూ.9వేలలోపే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్.. 128జీబీ స్టోరేజీ.. అద్భుతమైన ఫీచర్స్