
కొత్త హువావే ఫోన్‌లో 6.56 అంగుళాల LCD డిస్‌ప్లే, Kirin 8000S ప్రాసెసర్, HarmonyOS 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. సాధారణంగా OLED స్క్రీన్లలో కనిపించే Always-on Display ఫీచర్‌ను LCD ప్యానెల్‌లోనూ అందించడం ప్రత్యేకత. అంతేకాకుండా, AI ఆధారిత భద్రతా టూల్స్, 6,100mAh బ్యాటరీ, 40W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. చైనాలో అక్టోబర్ 31 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు, ఫీచర్లు బడ్జెట్ ఫోన్ కొనాలనుకునేవారిలో ఆసక్తిని పెంచుతున్నాయి.
Huawei Enjoy 100లో 6.56 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 1612 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 1,150 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. Always-on Display ద్వారా స్క్రీన్‌ను పూర్తిగా ఆన్ చేయకుండానే సమయం, నోటిఫికేషన్లను చూడవచ్చు.
ఈ ఫోన్ Kirin 8000S చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో HarmonyOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు హువావే సొంత Ark Engine టెక్నాలజీ ఉంది. మల్టీటాస్కింగ్ పనితీరును మెరుగుపరచడమే దీని లక్ష్యం. ఫేక్ AI గొంతులను గుర్తించి హెచ్చరించే ఫీచర్‌తో పాటు అనుమానాస్పద వెబ్‌సైట్లు, స్కామ్‌ల గురించి అలర్ట్‌లు ఇచ్చే భద్రతా సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఫోటోల కోసం వెనుకవైపు f/1.8 ఎపర్చర్‌తో 13MP ప్రధాన కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉన్నాయి. 6,100mAh బ్యాటరీకి 40W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. Wi-Fi 7, 5A నెట్‌వర్క్ సపోర్ట్, Star Flash టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఫోన్ బరువు సుమారు 204 గ్రాములు.
ధరల విషయానికి వస్తే, 128GB స్టోరేజ్ వేరియంట్‌ను 1,399 యువాన్లకు (సుమారు రూ.17,200), 256GB వేరియంట్‌ను 1,699 యువాన్లకు (సుమారు రూ.20,900) చైనాలో విడుదల చేశారు. Glacier White, Sunset Orange, Midnight Black రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. చైనాలో అక్టోబర్ 31 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. భారత మార్కెట్లో విడుదలపై ప్రస్తుతం అధికారిక సమాచారం లేదు.