మనం వాడే ఇంటర్నెట్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే! 99% డేటా ట్రాన్స్‌ఫర్ అయ్యేది వాటి ద్వారానే?

ప్రస్తుత రోజుల్లో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ఇంటర్నెట్ లేనిదే క్షణం గడవదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడాలన్నా, యూట్యూబ్ వీడియోలు ప్లే చేయాలన్నా లేదా వాట్సాప్‌లో మెసేజ్ పంపాలన్నా ప్రతి దానికీ డేటా ఉండాల్సిందే. అయితే ఎప్పుడైనా ఆలోచించారా?

మనం వాడే ఇంటర్నెట్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇదే! 99% డేటా ట్రాన్స్‌ఫర్ అయ్యేది వాటి ద్వారానే?
Wifi

Updated on: Jan 20, 2026 | 8:50 AM

ఏ వైరు లేకుండా గాలిలో ఈ సమాచారం అంతా మన ఫోన్‌లోకి ఎలా వస్తోంది? అసలు అమెరికాలో అప్‌లోడ్ చేసిన వీడియో మన ఊర్లో ఉన్న ఫోన్‌లో ఎలా ప్లే అవుతోంది? దీని వెనుక శాటిలైట్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు, కానీ అసలు నిజం వేరే ఉంది. మనం వాడుతున్న ఇంటర్నెట్‌లో 99 శాతం డేటా గాలిలో కాకుండా సముద్రం అడుగున ప్రయాణిస్తుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది పక్కా నిజం. ఆ గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

సముద్ర గర్భంలో సమాచార నిధి..

మనం ఇంటర్నెట్ అంటే వైర్‌లెస్ అని భ్రమపడతాం కానీ, దాదాపు 99 శాతం ఇంటర్నెట్ ఫిజికల్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. వీటిని ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అంటారు. ఈ కేబుల్స్ భూమి లోపలే కాకుండా, దేశాల మధ్య సముద్రాల అడుగున వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. ఇవి డేటాను కాంతి సంకేతాల రూపంలో కాంతి వేగంతో మోసుకెళ్తాయి. మీరు విదేశాల్లో హోస్ట్ చేసిన ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు, ఆ డేటా సముద్రపు అడుగున ఉన్న ఈ సబ్ మెరైన్ కేబుల్స్ ద్వారానే మీ దేశానికి చేరుతుంది.

టవర్ నుండి ఫోన్ వరకు..

ఒకసారి డేటా ఫైబర్ కేబుల్స్ ద్వారా మీ దేశానికి లేదా నగరానికి చేరుకున్నాక, అది మీకు అత్యంత సమీపంలో ఉన్న మొబైల్ టవర్‌కు చేరుతుంది. ఆధునిక టవర్లు నేరుగా ఫైబర్ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడి ఉంటాయి. దీనివల్ల డేటా ఏమాత్రం ఆలస్యం కాకుండా హై స్పీడ్‌తో డెలివరీ అవుతుంది. ఇక్కడ అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మొబైల్ టవర్ ఆ డేటాను రేడియో తరంగాలుగా మారుస్తుంది. మీ ఫోన్ ఆ తరంగాలను రిసీవ్ చేసుకుని, తిరిగి టెక్స్ట్, ఇమేజ్ లేదా వీడియో రూపంలోకి మారుస్తుంది. కేవలం టవర్ నుండి మీ ఫోన్ వరకు మాత్రమే ఇంటర్నెట్ వైర్‌లెస్‌గా పనిచేస్తుంది.

వైఫై కూడా పూర్తిగా వైర్‌లెస్ కాదు!

మనం ఇంట్లో వాడే వైఫై కూడా ఒక కేబుల్ ద్వారానే పనిచేస్తుంది. మీ ఇంటి రూటర్ వరకు ఇంటర్నెట్ అనేది బ్రాడ్‌బ్యాండ్ లేదా ఫైబర్ కేబుల్ ద్వారా వస్తుంది. ఆ రూటర్ మాత్రమే వైర్ ద్వారా వచ్చిన సిగ్నల్‌ను రేడియో తరంగాలుగా మార్చి ఒక గది లేదా ఇల్లు వంటి పరిమిత ప్రాంతంలో వైర్‌లెస్ కనెక్షన్ ఇస్తుంది. అందుకే కేబుల్ కట్ అయితే వైఫై ఉన్నా ఇంటర్నెట్ రాదు. అంతేకాదు, ఇంటర్నెట్ స్పీడ్ అనేది మనం వాడే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మీద ఆధారపడి ఉంటుంది.

4G, 5G మరియు రాబోయే 6G టెక్నాలజీలు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను వాడుతాయి. ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే డేటా అంత వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే 4G కంటే 5G లో వీడియోలు త్వరగా డౌన్లోడ్ అవుతాయి. మనం గాలిలో వస్తుందనుకుంటున్న ఇంటర్నెట్ వెనుక సముద్రాల అడుగున విస్తరించిన లక్షల కిలోమీటర్ల కేబుల్స్ కష్టం ఉంది. సాంకేతికత ఎంత పెరిగినా ఫిజికల్ కనెక్టివిటీనే ఇంటర్నెట్‌కు వెన్నెముక అని చెప్పక తప్పదు.