ప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్.. ఈయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎల్లప్పుడూ సోషల్ ప్లాట్ ఫాంలలో యాక్టివ్ గ ఉంటారు. ట్విట్టర్ ను కొనుగోలు చేసి, ఎక్స్ పేరిట సరికొత్తగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి మస్క్‌కు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ కంపెనీ టెస్లా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెక్నాలజీపై అవగాహన ఉండి.. రోజుకు ఏడు గంటలు నడవగిలిగే సామర్థ్యం ఉంటే చాలు.. గంటకు 48 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 4,000 వరకూ జీతం ఇస్తామని పేర్కొంది. మీరు పని చేయాల్సిన సమయం కేవలం ఏడు గంటలు మాత్రమే. అంటే మీరు ఒక రోజు పనిచేస్తే.. దాదాపు రూ. 28,000 వరకూ సంపాదించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
టెస్లా సంస్థ ఆప్టిమస్ పేరిట హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తోంది. ఈ రోబోకు ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చేందుకు వివిధ రంగాల్లో నైపుణ్యం వారిని నియమించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాజీని ఉపయోగిస్తూ ఆప్టిమస్ కు శిక్షణనిచ్చేందుకు తాజాగా ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది.
రోబోలకు శిక్షణనిచ్చేందుకు గానూ టెస్లా ప్రకటించిన ఈ ఉద్యోగాలకు ఆ కంపెనీ డేటా కలెక్షన్ ఆపరేటర్ అని నామకరణం చేసింది. డేటా కలెక్షన్ ఆపరేటర్ పేరుతోనే ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది.
డేటా కలెక్షన్ ఆపరేటర్ ఏం చేయాలనే దానిపై కూడా టెస్లా వివరణ ఇచ్చింది. మోషన్ క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్ ను ధరించి కొన్ని నిర్ధేశిత మార్గాల్లో ఉద్యోగులు నడవాల్సి ఉంటుంది. అలా రోజుకు ఏడు గంటలు నడవాల్సి ఉంటుంది. అందులో సమాచారాన్ని సేకరించడం, ఆ సమాచారాన్ని విశ్లేషించగల సామర్థ్యం కలిగి ఉండటం, సమగ్ర రిపోర్టులు రాసే నేర్పరితనం ఉండాలని టెస్లా పేర్కొంది.
ఇది కేవలం చదువుతో వచ్చే ఉద్యోగం మాత్రమే కాదండి. దీనికి శారీరక సామర్థ్యం కూడా అవసరమని టెస్లా ప్రకటించింది. ఎత్తు 5.7 నుంచి 5.11 మధ్య ఉండాలని, కనీసం 13 కిలోల బరువు మోయగలిగే సామర్థ్య ఉండాలని పేర్కొంది.
ఈ ఉద్యోగానికి జీతం కూడా గంటల లెక్కన ఇస్తున్నట్లు టెస్లా ప్రకటించింది. గంటకు 25.5 డాలర్ల నుంచి 48 డాలర్ల మధ్య ఉంటుంది. అనుభవం, నైపుణ్యం, సహా నిర్వర్తించే విధులను బట్టి మీకిచ్చే ప్యాకేజీలో మార్పులు ఉంటాయి. దీనిలో మెడికల్, డెంటల్, విజన్ బీమా, రిటైర్ మెంట్ ప్రయోజనాల వంటి ఇతర మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు టెస్లా పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం టెస్లా వెబ్ సైట్ లోని కెరీర్ పేజీలో చూడొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..