
ప్రస్తుతం ఈవీ మార్కెట్ విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగం జోరందుకుంటోంది. పర్యావరణ రక్షణపై పెరుగుతోన్న ఆసక్తి, ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు రాయితీలు ప్రకటించడంతో ఈ రంగం రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. అయితే విద్యుత్‌తో నడిచే వాహనాల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ఛార్జింగ్. ఈవీ రంగం శరవేగంగా విస్తరిస్తోన్నా, వాటికి అనుగుణంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావడం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ / డీజిల్ వినియోగ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపాంతరం చెందుతోన్న నేపథ్యంలో.. వాటికి తగినట్లుగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు కావడం లేదు. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాటరీలు సైతం ఫుల్ ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం, చార్జింగ్‌కు కూడా తక్కువ ఇవ్వడం సమస్యగా మారింది. దీంతో ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పరిశోధకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా కార్నెల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అధునాతన లిథియం బ్యాటరీని రూపొందించారు. అధునాతన సాంకేతకతతో రూపొందించిన ఈ బ్యాటరీ చార్జింగ్ కావడానికి కేవలం ఐదు నిమిషాలే పడుతుంది. 5 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ కావడం ఈవీ రంగంలో గేమ్ ఛేంజర్ అని చెబుతున్నారు. ఇక ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 482 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈవీ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫాస్ట్ ఛార్జింగ్ అవకాశం ఉన్నా.. ఛార్జింగ్ ఫుల్ కావడానికి కనీసం అర్ధగంట పడుతుంది. కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్స్ టీం చేపట్టిన పరిశోధనలు పూర్తి స్థాయిలో విజయవంతమైతే.. ఈవీ రంగంలో అద్భుతమని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. కార్నెల్ యూనివర్సిటీ రీసర్చ్ టీం చేపట్టిన ఈ బ్యాటరీ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉండగా త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..