Central GOVT Bringing Local Chating APP: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్ల డేటా ప్రశ్నార్థకంగా మారుతుందన్న వాదనలు వినిపించడంతో.. చాలా మంది వాట్సాప్‌ను డిలీట్ చేసి.. ఇతర ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు అడుగులు వేశారు. ఇటీవల వెల్లడైన ఓ సర్వే ఆధారంగా భారత్‌లో ఏకంగా సుమారు 2 కోట్ల మంది వాట్సాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసేశారు.
ఈ క్రమంలో ‘సిగ్నల్’, ‘టెలిగ్రామ్’ వంటి యాప్‌ల డౌన్‌లోడ్‌లు బాగా పెరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే భారత్‌లో విదేశీ యాప్‌లకు దెబ్బ కొట్టేలా భారత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వాట్సాప్‌ను పోలీన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘సందేశ్’ పేరుతో తీసుకురానున్న ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇందుకుగాను ప్రభుత్వ అధికారులకు ఈ యాప్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతర్గత సమాచార మార్పిడి కోసం కొంతమంది ఈ కొత్త యాప్‌ను ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇక యూజర్ల వ్యక్తిగత భద్రతే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ఈ యాప్‌లో ఓటీపీ ఆధారిత లాగిన్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ సహా ఆదునాతన ఫీచర్లతో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఈ యాప్‌కు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అంతా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అందించనుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ యాప్ ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది. మరి ఈ దేశీ యాప్ విదేశీ చాటింగ్ యాప్‌లపై ఏ మేర ప్రభావం చూపుతుందో చూడాలి.