
భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి ఆప్షన్ ఫ్యాన్. అయితే, నెలాఖరులో వచ్చే కరెంట్ బిల్లును చూసి చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. అంతేకాకుండా మార్కెట్లో ఉన్న అనేక రకాల ఫ్యాన్లలో సీలింగ్ ఫ్యాన్ కొనాలా? లేక టేబుల్ ఫ్యాన్ తీసుకోవాలా..? అనే గందరగోళం చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా కరెంట్ బిల్లు భయం ఉన్నవారికి ఈ ఎంపిక మరింత ముఖ్యం. మరి ఈ రెండింటిలో ఏది తక్కువ కరెంట్ వాడుతుంది? ఏది ఎక్కువ గాలిని ఇస్తుంది? అనే విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
కరెంట్ బిల్లు విషయంలో టేబుల్ ఫ్యాన్ స్పష్టమైన విజేతగా నిలుస్తుంది. సీలింగ్ ఫ్యాన్ సాధారణంగా 60 నుండి 80 వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయి. కానీ టేబుల్ ఫ్యాన్ కేవలం 30 నుండి 50 వాట్ల పరిధిలో మాత్రమే విద్యుత్‌ను వాడుకుంటాయి. మీరు రోజంతా ఫ్యాన్ వాడే వారైతే, టేబుల్ ఫ్యాన్ వాడటం వల్ల మీ విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు.
గాలి ప్రసరణ విషయానికి వస్తే సీలింగ్ ఫ్యాన్ మెరుగ్గా పనిచేస్తుంది. సీలింగ్ ఫ్యాన్ గది అంతటా గాలిని సమానంగా పంచగలదు. మీరు గదిలో ఎక్కడ కూర్చున్నా చల్లని గాలి అందుతుంది. టేబుల్ ఫ్యాన్ గాలిని ఒకే దిశలో ప్రసరింపజేస్తుంది. మీరు పనిచేసే డెస్క్ లేదా పడుకునే బెడ్ దగ్గర మాత్రమే గాలి కావాలనుకుంటే టేబుల్ ఫ్యాన్ సరిపోతుంది.
టేబుల్ ఫ్యాన్ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనిని ఎక్కడికైనా సులభంగా మోసుకెళ్లవచ్చు. వంటగది, బాల్కనీ లేదా స్టడీ రూమ్.. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. కానీ సీలింగ్ ఫ్యాన్ ఒకసారి అమర్చిన తర్వాత శాశ్వతంగా అక్కడే ఉంటుంది. దీనికి ప్లేస్ ఆదా అవుతుంది కానీ ఇతర ప్రాంతాలకు మార్చడం సాధ్యం కాదు.
టేబుల్ ఫ్యాన్లు తక్కువ ధరలో లభిస్తాయి, వీటికి ఎలాంటి ఇన్‌స్టాలేషన్ చార్జీలు ఉండవు. సీలింగ్ ఫ్యాన్లు కొంచెం ఖరీదైనవి. వీటిని బిగించడానికి టెక్నీషియన్ అవసరం ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్లు ఎత్తులో ఉండటం వల్ల వాటిని శుభ్రం చేయడం కష్టంతో కూడుకున్న పని. టేబుల్ ఫ్యాన్లను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
మీకు పెద్ద గది ఉండి, కుటుంబ సభ్యులందరికీ గాలి కావాలనుకుంటే సీలింగ్ ఫ్యాన్ తీసుకోండి. ఒకవేళ మీరు విద్యుత్‌ను ఆదా చేయాలనుకుంటే, చిన్న ప్రదేశంలో లేదా ఒక్కరే ఉండేవారైతే టేబుల్ ఫ్యాన్ బెస్ట్ ఆప్షన్.