
ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే ఎలక్ట్రిక్ అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రధాన సమస్య ఛార్జింగ్ సమయం. ఈ అడ్డంకిని అధిగమిస్తూ చైనాకు చెందిన ప్రముఖ ఈవీ దిగ్గజం బీవైడీ ఒక సంచలన ప్రకటన చేసింది. తన ప్రీమియం సబ్-బ్రాండ్ అయిన డెంజా నుంచి రాబోతున్న Z9 GT మోడల్‌తో ఛార్జింగ్ వేగంలో కొత్త చరిత్ర సృష్టించబోతోంది. వచ్చే నెలలో ఐరోపా మార్కెట్లో ఈ కారును విడుదల చేసేందుకు సంస్థ సర్వం సిద్ధం చేసింది.
సాధారణంగా ఈవీ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి గంటల సమయం పడుతుంది. కానీ డెంజా Z9 GTలో ప్రవేశపెట్టిన సరికొత్త ఫ్లాష్ ఛార్జింగ్ సాంకేతికతతో కేవలం 5 నిమిషాల్లోనే 10శాతం నుండి 70శాతం వరకు బ్యాటరీని నింపవచ్చు. ఇది పెట్రోల్ బంకులో ఇంధనం నింపే సమయంతో దాదాపు సమానం. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ కారు అద్భుత పనితీరు కనబరుస్తుంది. 30 డిగ్రీల సెల్సియస్ వంటి గడ్డకట్టే చలిలో కూడా కేవలం 12 నిమిషాల్లో 20శాతం నుండి 97శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుందని సంస్థ వెల్లడించింది.
ఈ కారు కేవలం ఛార్జింగ్ వేగంలోనే కాదు, ప్రయాణ దూరంలోనూ రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి స్థాయిలో ఛార్జింగ్ చేస్తే సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారులో మూడు మోటార్ల వ్యవస్థను ఉపయోగించారు. ఇది దాదాపు 1,000 హార్స్‌పవర్ సామర్థ్యాన్ని అందిస్తూ కారును అత్యంత వేగంగా అంటే 100 kmph కేవలం 3 సెకన్లలోనే అందుకుంటుంది.
ప్రస్తుతం చైనాలో మంచి గుర్తింపు పొందిన డెంజా బ్రాండ్‌ను, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఐరోపాలోని లగ్జరీ కార్ల మార్కెట్లోకి బీవైడీ తీసుకెళ్తోంది. పోర్షే టైకాన్ వంటి లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు ఇది గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారు ధర మరియు పూర్తి ఫీచర్లను వచ్చే నెలలో జరిగే లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు.