Bar Code Scanner APP Infecting Android Smartphones: స్మార్ట్ ఫోన్‌లు వచ్చిన తర్వాత పని చాలా సులువైందని సంతోష పడాలా వైరస్ దాడులు పెరిగాయని బాధపడాలా.? అర్థం కానీ పరిస్థితులు వచ్చాయి. మనకు తెలియకుండానే ఫోన్లలోకి వైరస్‌లు వచ్చేస్తున్నాయి. దీని ద్వారా ఫోన్లు పాడవడమే కాకుండా మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా కొందరు దుండగులు కాజేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ అప్లికేషన్ (యాప్) ద్వారా స్మార్ట్ ఫోన్‌లోకి వైరస్ ప్రవేశిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. ‘బార్ కోడ్ స్కానర్’ యాప్‌లో వైరస్ ప్రవేశించిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ వేగంగా ఇతర మొబైల్స్‌లోకి వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను తొలగించినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ యాప్‌ను ఇప్పటికే కోటి మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే.. ఫోన్ క్రాష్ కావడంతో పాటు రకరకాల ప్రకటనలు వస్తున్నాయని కొందరు స్మార్ట్ ఫోన్ యూజర్లు గుర్తించారు. దీంతో ఈ యాప్‌ను ఉపయోగిస్తున్న వారు వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలని గూగుల్ సూచించింది.